ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదన్న సుప్రీం తీర్పుపై స్పందించారు కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్. సుప్రీం నిర్ణయానికి సమాధానంగా అత్యవసర ఆదేశాలు జారీ చేయాలని అభిప్రాయపడ్డారు. న్యాయసమీక్ష అవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని రాజ్యాంగం లోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని పేర్కొన్నారు.
సుప్రీం నిర్ణయంపై నిపుణుల సలహా తీసుకుని న్యాయసమీక్షకు వెళ్లాలని కేంద్రాన్ని కోరారు పాసవాన్.
"న్యాయసమీక్ష పిటిషన్‌కు అవకాశం ఉంది. కానీ దీనికోసం మళ్లీ న్యాయస్థానానికే వెళ్లాలి. అక్కడ అది నిలుస్తుందా లేదా అనే దానికోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం వేచిచూడకుండా ప్రభుత్వమే ఓ అత్యవసర ఆదేశాన్ని, రాజ్యాంగ సవరణను చేపడితే బాగుంటుంది."
-రాం విలాస్ పాసవాన్, కేంద్రమంత్రి
2012లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఇటీవల విచారణ చేపట్టింది. రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరేమి కాదని అభిప్రాయపడింది. అదే సమయంలో పదోన్నతుల అంశంలోనూ ఆయా వర్గాలకు కోటా ప్రాథమిక హక్కేమీ కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కోటా అమలుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని పాసవాన్ అన్నారు.
ఇదీ చూడండి: దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ