కరోనా ప్రభావంతో గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలపై ప్రధానంగా దృష్టిసారించి... కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా వ్యూహాలు రచించింది. కార్మికులు, ఉద్యోగులకు ఊరట కలిగే విధంగా 15 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించింది.
ఆత్మనిర్భర భారత్ అభియాన్ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు విశదీకరించారు. భారత్ స్వయంశక్తితో ఎదగాలన్న లక్ష్యంతో 15 ఉద్దీపన చర్యల వివరాలు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 6 ఎంఎస్ఎంఈల కోసమే కేటాయించారు.
ఎంఎస్ఎంఈపైనే దృష్టి
ఉద్దీపన చర్యల్లో భాగంగా చిన్న, మధ్య తరహా, కుటీర లఘు పరిశ్రమలపై ప్రధానంగా దృష్టి సారించారు నిర్మల. కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ఎంఎస్ఎంఈలపై వరాల జల్లు కురిపించారు. ఇందుకోసం ఆరు చర్యలను ప్రతిపాదించారు.
లాక్డౌన్ కారణంగా మూతపడ్డ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తక్షణమే తెరిచి, లక్షలాది మంది జీవనోపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయని తెలిపారు నిర్మల. కోట్లాది మంది చిన్న ఉద్యోగులు, కార్మికులకు ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తుందని స్పష్టం చేశారు.
ఎమ్ఎస్ఎమ్ఈల కోసం ఆరు చర్యలు
వేతన జీవులకు ఊరట
లాక్డౌన్ వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేతన ఉద్యోగులకు సైతం ఆర్థిక మంత్రి తీపి కబురు అందించారు. కంపెనీ, ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగుల చేతికి అందే జీతం(టేక్ హోమ్ సేలరీ) పెరగనుంది. దీని వల్ల ఉద్యోగులకు మూడు నెలలకు గాను రూ.6,750 కోట్లు లబ్ధి చేకూరనుంది.
పన్ను చెల్లింపుదారులకూ
ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులందరికీ మేలు చేసేందుకు టీడీఎస్ రేట్లను తగ్గిస్తున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్ రేట్లలో 25శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం గురువారం నుంచి 2021 మార్చి 31వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వెసులుబాటు వల్ల సుమారు రూ.50 వేల కోట్ల ద్రవ్య లభ్యత కలుగుతుందని స్పష్టం చేశారు.
రిటర్నుల గడువు పెంపు
వ్యక్తిగత పన్ను చెల్లింపు గడువును సైతం పెంచారు నిర్మల. లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూలై, అక్టోబర్‌లో దాఖలు చేయాల్సిన రిటర్న్‌ల గడువును 2020 నవంబర్ 30 వరకు పెంచారు.
లిక్విడిటీ పెంపు కోసం...