భారతదేశ ఐక్యత, సమగ్రతకు పాటుపడే వ్యక్తులు, సంస్థలను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరిట 'సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా పురస్కారం' ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర హోంశాఖ.
ఏడాదికి మూడు..
ఈ అవార్డులో పతకం, ప్రశంస పత్రం ఉంటుంది. అరుదైన, అత్యత అర్హమైన కేసులో మినహా మరణానంతరం ఈ పురస్కారం అందించటం కుదరదని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి ఆర్థిక రివార్డు ఉండదు. ఒక ఏడాదిలో మూడు కన్నా ఎక్కువ పురస్కారాలు ఇవ్వకూడదని నిర్ణయించింది ప్రభుత్వం.
ఐక్యత దినోత్సవం రోజున ప్రకటన...
సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. జాతీయ ఐక్యత, సమగ్రతను ప్రోత్సహించడానికి స్ఫూర్తిదాయకమైన సహకారం అందించి.. దృఢమైన భారత్ నిర్మాణంలో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఏటా ఇచ్చే పద్మ పురస్కారాల కార్యక్రమంలో భాగంగానే ఈ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
ఎంపిక కమిటీ...
అవార్డుల ఎంపికకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమిస్తారు. ఇందులో కెబినెట్ కార్యదర్శి, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, రాష్ట్రపతి కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వారితో పాటు మరో ముగ్గురు లేదా నలుగురు ప్రముఖ వ్యక్తులను ఈ కమిటీలో సభ్యులుగా ప్రధాని నియమిస్తారు.
వ్యక్తిగతంగానూ..
భారత పౌరులు, సంస్థలు ఈ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం కల్పించారు. వ్యక్తిగతంగా నామినేట్ చేసుకోవచ్చు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన విభాగాలు, మంత్రులు కూడా పేర్లు సిఫార్సు చేయొచ్చు.
ఆన్లైన్ ద్వారానే...
ఏటా నామినేషన్లు స్వీకరిస్తారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ప్రాంతీయ, కుల,మత, లింగ భేదం, పుట్టిన ప్రాంతం, వయస్సు, వృత్తికి సంబంధం లేకుండా ఈ అవార్డుకు అందరినీ అర్హులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ.
ఇదీ చూడండి: మృత్యువు అంచుల వరకు వెళ్లి బతికాడు!