కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో వలస కార్మికులకు ఉపశమనం కల్పించేలా ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక ప్యాకేజీ 2.0లో వలస కార్మికులు, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఉన్న ప్రకటనలపై ఈటీవీ భారత్తో తన అభిప్రాయాలు పంచుకున్నారు వ్యవసాయ రంగ నిపుణులు దేవిందర్ శర్మ.
"రేషన్ కార్డు లేని వారికీ రెండు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు ఇవ్వటం స్వాగతించదగ్గ నిర్ణయం. ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు పథకంపై ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేయటం సానుకూల అంశం. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా ప్యాకేజీ రావాలని కోరుకున్నాము. రైతులకు నేరుగా నగదు ఇవ్వడం మంచిదని అనుకున్నాం. కానీ అది ఆర్థిక మంత్రి ప్రకటనలో లేదు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాలను మరో రూ. 2 లక్షల కోట్లు పెంచుతామని కేంద్ర ప్రకటించింది. దాంతో 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు" అని తెలిపారు దేవిందర్.