మే 3తో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిచింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జోన్ల ఆధారంగా లాక్‌డౌన్‌పై సడలింపులు ఇచ్చింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమాన, రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను కేంద్రహోంశాఖ నిర్దేశించింది.
లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలు
- దేశవ్యాప్తంగా విద్యా, శిక్షణా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్, వ్యాయామ శాలలు, క్రీడా ప్రాంగణాలు మూసి ఉంచాలి. ఎటువంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదు. జనాలు ఒకచోట గూమిగూడటంపై నిషేధం కొనసాగనుంది.
- రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లను కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విభజిస్తుంది. వారానికోసారి అక్కడి పరిస్థితులను బట్టి వాటిిలో మార్పులు చేర్పులు ఉంటాయి.
- గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకూడదు. అక్కడ భౌతిక దూరం తప్పకుండా పాటించాలి.
- దేశవ్యాప్తంగా రెడ్ జోన్లలోని కంటైన్మెంట్ ప్రాంతాలకు వెలుపల నిషేధించిన కార్యకలాపాలతోపాటు బస్సులు, రిక్షాలు, ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలపై నిషేధం ఉంటుంది. క్షౌర శాలలు, స్పాలు మూసి ఉంచాలి.
- రెడ్ జోన్లలో అత్యవసర సందర్భాల్లో కార్లలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, బైక్‌లపై ఒకరుచొప్పున ప్రయాణం చేయొచ్చు.
- పారిశ్రామిక సంస్థలు, సెజ్‌లు, ఎగుమతుల యూనిట్లు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల నిర్వహణకు అనుమతి. పట్టణ ప్రాంతాల్లో స్థానిక కూలీలతో భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. పునరుత్పాదక వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలకూ అనుమతి.
- పట్టణ ప్రాంతాల్లో మాల్స్, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లేదు. కాలనీల్లోని చిన్నపాటి కిరాణా దుకాణాలు నిర్వహించవచ్చు.
- రెడ్‌జోన్లలో నిత్యావసరాల సరఫరాకే ఈ-కామర్స్ సంస్థలు పనిచేయాలి. 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. మిగతావారు ఇళ్లనుంచే పనిచేయాలి.
- అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. మిగతావారిని అవసరాన్ని బట్టి 33 శాతం వరకు రప్పించాలి.
- రెడ్‌జోన్లలో చాలా వరకు వాణిజ్య, ప్రైవేట్ సంస్థల నిర్వహణకు అనుమతి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, కాల్ సెంటర్లు, శీతల గిడ్డంగులు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇతర స్వయం ఉపాధి రంగాల నిర్వహణకు అనుమతి.
- గ్రీన్ జోన్లలో దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు మినహా మిగతావి కొనసాగించవచ్చు. బస్సుల్లో 50 శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించవచ్చు. డిపోల్లోనూ 50 శాతం సిబ్బందికి అనుమతి ఉంది.
- గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఉంటుంది
- ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, ఒక సహాయకుడి సాయంతో అనుమతి
- వివాహాల వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు.
- అంత్యక్రియలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా.
మోదీ ప్రసంగం!
లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది.