అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అయోధ్య ట్రస్టుకు కేంద్రం ఒక రూపాయి విరాళంగా ఇచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ఒక్క రూపాయిని ప్రభుత్వం తరఫున రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు.
రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు నగదు, ఆస్తుల రూపంలో ఇచ్చినా ఎటువంటి షరతులు విధించకుండా స్వీకరించనున్నట్లు ట్రస్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్రస్టు మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ ఇంటిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలను నిర్వహించనుంది. త్వరలోనే ఈ ట్రస్టుకు అధికారిక కార్యాలయాన్ని అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
మోదీ ప్రకటన
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం స్వతంత్ర ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు లోక్‌సభ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ఆలయ నిర్మాణంలో అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారు. వారిలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ ట్రస్టుకు ప్రముఖ న్యాయ కోవిదుడు పరాశరన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.