సీబీఐ అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తప్పించింది కేంద్రం. ప్రధాన మంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
కేంద్ర దర్యాప్తు సంస్థతో పోలిస్తే.. ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్‌కు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇది జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తుంది.
1986 ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం సమయంలో నాగేశ్వరరావుకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఎలాంటి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోరాదని అత్యున్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది.
ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. దీనిపై ఆగ్రహించిన సుప్రీం ఆయనను రోజంతా కోర్టు ఆవరణలోనే కూర్చోవాలని ఆదేశించడమే కాకుండా లక్ష రూపాయల జరిమానాను విధించింది.
తెలంగాణ ఉమ్మడి వరంగల్‌లోని జయశంకర్ జిల్లా.. బోర్‌నర్సాపూర్ గ్రామం నాగేశ్వరరావు స్వస్థలం.