కన్నడ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో విశ్వాసపరీక్ష మరింత జాప్యం చేసేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. గవర్నర్ ద్వారా ఒత్తిడి తెచ్చి వెంటనే బలపరీక్ష చేపట్టేలా భాజపా ప్రయత్నిస్తోంది.
రాజ్‌భవన్ ఒత్తిళ్లను పట్టించుకోని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్... విశ్వాస తీర్మానంపై చర్చలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించారు. సభలో చర్చ జరుగుతుండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి జేడీఎస్, కాంగ్రెస్.
సుప్రీంలో సీఎం పిటిషన్
సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ తనకు లేఖలు పంపడంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం కుమారస్వామి. నేడు శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోగా విశ్వాసం నిరూపించుకోవాలని గవర్నర్ పంపిన లేఖపై స్పందిస్తూ... తనకు రెండో ప్రేమ లేఖ అందిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు సీఎం.
విశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా సభా కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుమార స్వామి. విప్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. విప్ అనేది రాజ్యాంగ హక్కని పిటిషన్‌లో పేర్కొన్నారు సీఎం.
సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్
17వ తేదీనాటి ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు. సభకు 15 మంది రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న ఆదేశాలపై స్పష్టత కోరారు. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కని పిటిషన్‌లో పేర్కొన్నారు దినేష్. 10వ షెడ్యూల్ ఉల్లంఘన ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు.