పారిస్ ఒప్పందాన్ని అమలు పరిచే విధంగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. అపెక్స్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పారిస్ అగ్రిమెంట్ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ.
కమిటీ విధులు..
- దేశంలో కర్బన ఉద్గారాలు ఎక్కువగా వస్తున్న ప్రదేశాలను గుర్తించి వాటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలి.
- అందుకు అవసరమైన నియమ నిబంధనలు, తప్పనిసరి చేయాల్సిన కార్యకలాపాలను అమలులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.
- ప్రైవేటు సంస్థలనూ ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసేందుకు వారితో ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకొని జాతీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలి.
- దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు ముమ్మరం చేయడం సహా సంస్థాగత, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.
17 మందితో కమిటీ..
2021 నుంచి పారిస్ ఓప్పందం అమలులోకి రానున్న నేపథ్యంలో అపెక్స్ కమిటీ ఏర్పాటు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలోనే 17 మంది సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి.. ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.ఆ శాఖ అదనపు కార్యదర్శి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉంటారు.
అటవీ, పర్యావరణ శాఖ అదనపు డీజీ(అటవీ), ఆర్థిక, వ్యవసాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన, జలశక్తి, విద్యుత్, భూభౌతిక, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, గ్రామీణాభివృద్ది, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
పారిస్ ఒప్పందం అంటే?
పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. ఫలితంగా కార్బన్‌డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరవు వంటి అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ప్రపంచ దేశాలు కుదుర్చుకున్నదే పారిస్ ఒప్పందం. దీనిపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.
ఇదీ చూడండి: 'పారిస్' నుంచి అమెరికా వాకౌట్‌పై ఐరాస విచారం