మధుమేహం అదుపులో లేకపోతే వచ్చే కాళ్ల, కీళ్ల నొప్పులను భరించడం పెద్ద సవాలే. అలాగని, నొప్పి తగ్గించేందుకు గంపెడు మాత్రలు, మరింత నొప్పి పుట్టించే శస్త్ర చికిత్సలూ చేయించుకోలేరు. అందుకే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని జెరియాట్రిక్ విభాగం వైద్యులు ఓ పరిశోధన చేసి లేజర్ థెరపీని కనుగొన్నారు.
" 40 మంది రోగులపై ప్రయోగం చేశాం. అందులో 20 మందికి కేవలం మందులే ఇచ్చాం. మరో 20 మందికి మందులతో పాటు లేజర్ థెరపీ చేశాం. కేవలం మందులు వాడినవారికి నొప్పి తాత్కాలికంగానే తగ్గింది. కానీ, థెరపీ పొందినవారికి అసాధారణమైన ఉపశమనం కలిగిందని తెలిపారు. ఈ పరిశోధనలో ఈ లేజర్ చికిత్స ఔషధాలకన్నా ప్రభావితంగా పని చేస్తుందని తేలింది."
-ప్రసోన్ ఛటర్జీ, ఎయిమ్స్ వైద్యుడు
కాళ్ల నొప్పులు సాధారణమే కదా అని, అశ్రద్ద చేస్తే తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వైద్యులు.
"డయాబెటిస్ అధిక రోజులు అదుపులో ఉండకపోతే వారి కాళ్లలో ఉండే డైబెటిక్ పెరిఫ్యురల్ న్యూరోపతి ప్రభావితం అవుతుంది. అప్పుడు తీవ్రమైన నొప్పి, విసుగు, ఒంటరితనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రుళ్లు నిద్ర ఉండదు. సాధారణ జీవనం నుంచి వేరైనట్లుగా ఉంటుంది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం కూడా ఎక్కువే."
- ప్రసోన్ ఛటర్జీ, ఎయిమ్స్ వైద్యుడు
అందుకే మధుమేహంతో బాధపడేవారు, కాళ్ల నొప్పులకు ఎయిమ్స్ కనుగొన్న లేజర్ థెరపీని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నారు వైద్యులు.