లంఖణం పరమౌషధమన్న భావన దీర్ఘకాలంగా మన సమాజంలో ఉంది. అది అక్షర సత్యమని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది. ఆరోగ్య పరిరక్షణ కోసం అప్పుడప్పుడు ఉపవాసం చేయాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించేందుకు దిల్లీలో ఒక సదస్సు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 300 మందికిపైగా వైద్యులు ఇందులో పాల్గొంటున్నారు. శరీరంలోని లిపిడ్లను నియంత్రించడానికి ఉపవాసం దోహదపడుతుందని, తద్వారా గ్లైసెమిక్ సూచీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చని వైద్యులు తెలిపారు. బరువు తగ్గడానికి, మరింత చురుకైన జీవనశైలికి కూడా ఇది దోహదపడుతుందని వివరించారు.
ఈ శతాబ్దంలో ఔషధ శాస్త్రం గణనీయంగా వృద్ధి చెందింది. అయితే రుగ్మతలు దరిచేరని రీతిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందన్న విషయం అనేక మందికి ఇంకా తెలియదు. ఆరోగ్యంపై అనేక మందికి శ్రద్ధ పెరుగుతోంది. ఇందులో భాగంగా అడపాదడపా ఉపవాసం వైపు 30-40 శాతం మొగ్గారు. దీని ప్రయోజనాలను గుర్తించి, మరింత ఎక్కువ మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు...
ఉపవాసం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక వ్యాధులపై పోరాటం చేసేలా శరీరానికి సాయం అందుతుంది’’ అని స్మార్ట్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు బి.కె.మోదీ పేర్కొన్నారు. దీర్ఘకాల వ్యాధి, మధుమేహం, అధికరక్తపోటు వంటివి లేకుంటే ఏ వయసు వారైనా అప్పుడప్పుడూ ఉపవాసం ఉండొచ్చని మరో వైద్యుడు చెప్పారు. ఈ సదస్సులో మెరుగైన జీవనం కోసం అధునాతన వైద్య పరిజ్ఞానం, భావి నూతన ఆవిష్కరణలు వంటి అంశాలపై చర్చించారు.