2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాను కాదని ఓటర్లు కాంగ్రెస్‌కు అధిక స్థానాలిచ్చారు. 40 సీట్లున్న గోవాలో 14 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. రెండు సీట్ల తేడాతో వెనకబడింది భాజపా. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ చెరో మూడు సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్రులు మూడు, ఎన్సీపీ ఒక స్థానం సాధించింది.
మెజార్టీ ఉన్నా వ్యూహాల కొరతతో...
2017 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన అనంతరం మెజార్టీ స్థానాలున్న తమనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ మృదులా సిన్హాను కోరింది కాంగ్రెస్. అయినా, మ్యాజిక్ నంబర్‌ను సాధించే రేసులో వెనుకబడింది. 12 సీట్లు గెలిచిన భాజపా మాత్రం మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల మద్దతు కూడగట్టి రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను వెనక్కి తెచ్చి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరో అవకాశం వచ్చినా...
పారికర్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలంటూ గవర్నర్‌కు ఆదివారం రాత్రి లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు. అయితే, ఈ సారీ నిరాశే మిగిలింది.
భాజపా కూటమిలోని పార్టీలను, స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకోవడంలో విఫలమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఇద్దరు భాజపా ఎమ్మెల్యేల మృతి, ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో శాసనసభ్యుల సభ్యుల సంఖ్య 36కు చేరినా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చతికిలపడింది హస్తం పార్టీ.
ఫలించిన గడ్కరీ మంత్రాంగం
2017లో భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. తన పూర్వ సహచరుడు, గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారికర్ మృతి తర్వాత హుటాహుటిన గోవాకు చేరుకున్నారు గడ్కరి. పారికర్ అంత్యక్రియల తర్వాత అర్థరాత్రి సమయంలో కూటమి పార్టీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
క్రియాశూన్యతతోనే...
చిన్నపార్టీలను తమవైపునకు తిప్పుకోవడంలో విఫలమయ్యారు కాంగ్రెస్ నేతలు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సిన తరుణంలో వ్యూహాలు సరిగా అమలు చేయలేక మరోసారి అవకాశాన్ని చేజార్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో చిన్నరాష్ట్రమైన గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం హస్తం పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు.