కొవిడ్ వ్యర్థాలకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ ఉన్నా, లేకపోయినా.. ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను కత్తిరించి, కనీసం 72 గంటల పాటు పేపర్ బ్యాగుల్లో ఉంచిన తర్వాతే వాటిని పడేయాలని పేర్కొంది సీపీసీబీ. ప్రజల నుంచి సేకరించిన పీపీఈ వ్యర్థాలను తొలగించేటప్పుడు కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టాలని మాల్స్, వాణిజ్య సముదాయాలకు సూచించింది.
"సాధారణ గృహాల్లో.. ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను పేపర్ బ్యాగులో కనీసం 72గంటల పాటు ఉంచాలి. అనంతరం వాటిని పొడి ఘన వ్యర్థాలుగా పడేయ్యాలి. పునర్వినియోగించకుండా.. వాటిని కత్తిరించాలి. వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాళ్లు, సంస్థలు, కార్యాలయాల్లో ప్రజల నుంచి సేకరించిన పీపీఈలను ఇదే విధంగా 3రోజుల పాటు భద్రపరిచి.. పొడి ఘన వ్యర్థాలుగా పడేయాలి."
--- సీపీసీబీ మార్గదర్శకాలు.
మరోవైపు కరోనా బాధితులు తిన్నాక మిగిలిపోయిన భోజనం, వారు ఖాళీ సీసాలను బయోమెడికల్ వ్యర్థాలుగా పరిగణించకూడదని.. వాటిని కూడా ఇతర సాధారణ ఘన వ్యర్థాలతో కలిపి సేకరించాలని స్పష్టం చేసింది సీపీసీబీ. అనంతరం వాటిని బ్యాగుల్లో పెట్టి.. ఆ బ్యాగులను తాళ్లతో కట్టేయాలని పేర్కొంది.
"వ్యర్థాలను తగ్గించేందుకు.. కరోనా బాధితులకు భోజనం పెట్టేడప్పుడు, పునర్వినియోగించలేని వస్తువులను వాడాలి. అది కూడా ఆసుపత్రి మార్గదర్శకాలను అనుసరిస్తూ వాటిని ఉపయోగించాలి. అది కుదరకపోతే.. బయో-డీగ్రేడబుల్ వస్తువులను వాడాలి. అనంతరం తడి-పొడి ఘన వ్యర్థాలను బ్యాగుల్లో పెట్టి వాటిని కట్టేయాలి."
--- సీపీసీబీ మార్గదర్శకాలు.
తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు సహా ఐసోలేషన్ వార్డుల్లో కొవిడ్ వ్యర్థాల కోసం ప్రత్యేకంగా చెత్తబుట్టలను పెట్టాలని సూచించింది సీపీసీబీ.
ఇదీ చూడండి:- రికవరీలో రికార్డ్- ఒక్కరోజులో 29 వేల మందికి విముక్తి