రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తేనే దేశం పురోగమిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో లింగవివక్ష లేదని ఆచరణలో చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనపై అందరూ ఏకాభిప్రాయానికి రావాలన్నారు. మహిళలకు సమాన అవకాశాలపై ఫేస్బుక్ వేదికగా ఆయన ఆదివారం తన మనోగతాన్ని పంచుకున్నారు. లోక్సభ శాసనససభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించిందని, కానీ 2014లో 15వ లోక్సభ రద్దు కావడం వల్ల అది ఆమోదం పొందలేదని గుర్తు చేశారు.
"దేశ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నందున రాజకీయాలు సహా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు ఇవ్వకపోతే మనం పురోగతి సాధించలేం. మహిళలను సమానంగా చూసే సంస్కృతి మనది. వేదకాలంలో మైత్రేయి, గార్గి, ఘోషా, విశ్వతార తదితర స్త్రీలు పురుషులతో సమానమైన హోదా పొందారు. మహిళలను గౌరవించడం, వారి ప్రతిభ, సహకారాన్ని గుర్తించడం భారతీయ జీవన విధానం" అని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తూ శతాబ్దాలుగా కుమార్తే కన్నా కుమారుడికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి అవాంఛిత పద్ధతులు సాంఘిక జీవనంలో భాగమయ్యాయని, తద్వారా భ్రూణ హత్యలు, శిశు హత్యలు వంటి అమానవవీయ ఘటనలకు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్నం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. పుత్ర ప్రాధాన్య మనస్తత్వం నుంచి బయటపడాలన్నారు. సమాజంలో బాలికలు, మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వారి సాధికారతకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఉపరాష్ట్రపతి అభిలషించారు.