దిల్లీ ఆనంద్ విహార్‌లో వలస కార్మికులు గుమిగూడడం, నిజాముద్దీన్‌లో తబ్లీగీ ప్రార్థనలు నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనల వల్ల కరోనా నియంత్రణ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.
రామ్‌నాథ్ కోవింద్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి వీడియో లింక్ ద్వారా రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. లాక్డౌన్ కొనసాగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ ఒక్కరూ పస్తులు లేకుండా చూడాలని సూచించారు. ఆహారం, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
దాడులు దురదృష్టకరం
ప్రజలు సామాజిక, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు.
ఆదుకోవాలి..
ఈ సంక్షోభ సమయంలో నిరాశ్రయులు, నిరుద్యోగులు, బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని రామ్‌నాథ్ కోవింద్... గవర్నర్లను ఆదేశించారు. కొవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి చర్చించారు.
ఇదీ చూడండి: మర్కజ్‌కు వెళ్లిన విదేశీయులపై కేంద్రం కొరడా