గాంధీ తాను పాల్గొనే ఏ సమావేశాన్నైనా సర్వమత ప్రార్థనలతో ప్రారంభించేవారు. ఈ వైఖరే మత సామరస్యం పట్ల ఆయన ఎంత విశ్వాసంగా ఉండేవారో చెబుతోంది. గాంధీ తండ్రికి ఇస్లాం, జోరాస్ట్రియన్ మతాలకు చెందిన స్నేహితులు ఉండేవారు. వారు తమ విశ్వాసాల గురించి తన తండ్రితో చర్చించే విషయాలను గాంధీ శ్రద్ధగా వినేవారు. కొందరు క్రైస్తవ మతబోధకులు హిందూ దేవతలపై విమర్శలు చేయడం, తాగడం - పశు మాంసం తినడం ఆ మత విశ్వాసంలో భాగమని గాంధీ బాల్యంలో భావించేవారు.
బైబిల్ నేర్పిన పాఠం...
క్రైస్తవ మతంపై గాంధీకి మొదట్లో సదుద్దేశం ఉండేది కాదు. కానీ.. ఇంగ్లాండ్‌లో బైబిల్ చదివిన తర్వాత క్రైస్తవ మతంపైనా గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎవరైనా ఓ చెంపపై కొడితే, రెండో చెంప చూపాలనే భావజాలాన్ని బైబిల్ నుంచి గ్రహించారు. అంతకుముందు చదివిన ఇతర మత గ్రంథాల ద్వారా చెడును చెడుతో కాకుండా మంచితో జయించాలి అనే సిద్ధాంతాన్ని గాంధీ ఏర్పరుచుకున్నారు. ఇలా చిన్నతనంలోనే అన్ని మతవిశ్వాసాలను దగ్గరగా చూసిన, చదివిన గాంధీ.. అన్ని మతాలకు సమాన గౌరవం దక్కాలనే నిశ్చయానికి వచ్చారు.
మను స్మృతి పఠనంతో...
యవ్వనప్రాయంలోనే మత సామరస్యంపై గాంధీలో లోతైన అవగాహనతో ఉండేవారు. శాకాహారమే నిజమైన ఆహారమని తెలిపే మను స్మృతి చదివిన తర్వాత నాస్తికుడిలా మారారు. మత గ్రంథాల నుంచి దేవుడు, దేవునిపై విశ్వాసం అనే ఆధ్యాత్మికం కన్నా.. నైతిక విలువలు, విధానాలు, సత్యం, ధర్మం అనేక ఉత్తమ జీవన ప్రమాణాలను గాంధీ తెలుసుకున్నారు.
విభజన విషయంలో అలా...
దేశ విభజనలో గాంధీ పాత్ర పరిమితంగానే ఉన్నా.. విభజనను సమర్థించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. వాస్తవానికి ప్రముఖ కవి ఇక్బాల్, హిందూ వాది సావర్కర్ బాహాటంగానే రెండు దేశాల ఏర్పాటును సమర్థించారు. కానీ.. అదే హిందూవాదులు దేశ విభజనను ఆపేందుకు నిరహార దీక్ష ఎందుకు చేయలేదని గాంధీని ప్రశ్నించడం గమనార్హం. నిజం ఏంటంటే.. భారత విభజనకు సంబంధించిన నిర్ణయాధికారం ఎక్కువగా మౌంట్ బాటెన్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మహ్మద్ అలీ జిన్నాలనే చూసుకున్నారు. ఈ అంశంలో గాంధీ పాత్ర చాలా తక్కువ. ఒక వేళ నిజంగా గాంధీ దేశ విభజనను సమర్థించి ఉంటే.. బ్రిటీష్ నుంచి పరిపాలన భారత్, పాకిస్థాన్‌కు బదిలీ చేసే కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు ? ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉన్నారు? భారత దేశం స్వతంత్రంగా అవతరిస్తున్న వేళ గాంధీ నౌఖాలిలో మత ఘర్షణలు ఆపాలంటూ నిరాహార దీక్షలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలి.
దీక్షలపై దుష్ప్రచారం...
ఈ సమయంలో తన సూచనలకు అనుగుణంగా ప్రజలు సహనం, అహింస, మత సామరస్యం పాటించకపోవడంపై గాంధీ బాహాటంగానే అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన చేయగలిగిందల్లా మత ఛాందసవాదం ప్రబలకుండా, దాడులు ఆపేలా ప్రజలపై నైతిక ఒత్తిడి తీసుకురావడం. ఇందుకోసమే బంగాల్ నుంచి తిరిగివచ్చిన వెంటనే 1948 జనవరిలో దిల్లీలో గాంధీ నిరాహార దీక్ష చేశారు. భారత్‌లో మైనారిటీలు, ముస్లింలు - పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులకు మద్దతుగా గాంధీ ఈ దీక్ష చేపట్టారు. కానీ హిందూవాదులు మాత్రం గాంధీ దీక్షపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. భారత్... పాకిస్థాన్‌కు 55 కోట్ల రూపాయలు చెల్లించాలనే డిమాండ్‌తోనే గాంధీ దీక్ష చేస్తున్నారని ప్రచారం చేశారు. కానీ అది అప్పటికే ఒప్పందం రూపంలో కుదిరిన అవగాహన. అవిభజిత భారత ఆస్తుల పంపకాలపై మౌంట్ బాటెన్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్... పాకిస్థాన్‌కు 55 కోట్ల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అంశంలో గాంధీ మత సామరస్యం కోసం పాటుపడితే హిందూవాదులు మాత్రం ఆయనపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కల్పించాలనే లక్ష్యంగా కొంత ప్రయత్నం చేశారు. కానీ గాంధీ దీక్షకు భారత్ , పాకిస్థాన్‌లోని ముస్లింల నుంచి సానుకూల స్పందన లభించింది.
మాటతీరుపైనా...
మరికొంత మంది గాంధీ హిందువులతో మాట్లాడినంత కోపంగా ముస్లింలతో మాట్లాడలేదని అంటారు. ముస్లిం పక్షపాతిగా అభివర్ణిస్తారు. ఇది కూడా వాస్తవం కాదు.
నిరాహార దీక్ష సమయంలో కలిసేందుకు వచ్చిన పాకిస్థాన్ జాతీయవాద ముస్లింలతో అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత దేశానిదే అని స్పష్టం చేశారు బాపూజీ. పాకిస్థాన్‌లోని మైనారిటీలను ముస్లిం వ్యతిరేకులుగా, అనైతికులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భారత్‌లోని మైనారిటీల రక్షణకు ఎలాంటి భంగం కలగకూడదంటే.. వెంటనే పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు ఆపాలని తేల్చి చెప్పారు.
గాంధీతో దీక్ష విరమింపజేసేందుకు కొంతమంది ముస్లింలు తాము మత దాడులను నిలిపివేశామని ఆధారాలతో చూపేందుకు వస్తే ముందు మనసులను శుభ్రపరుచుకోవాలని చెప్పిన మహనీయుడు గాంధీ.
4 దశాబ్దాల్లో అనూహ్య మార్పులు...
గాంధీపై అప్పటికే ప్రజల్లో ఏర్పడిన నమ్మకం ఫలితంగా మత ఘర్షణలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. గాంధీ హత్య తర్వాత జరిగిన పరిణామాలతో మత దాడులు చాలా వరకు తగ్గాయి. ఆ సమయంలో హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నిషేధం విధించటం వంటి చర్యలు ఇందుకు కొంత దోహదం చేశాయి. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మత ఘర్షణలు మళ్లీ కొత్త రూపు సంతరించుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అప్పటివరకు అంతర్గతంగా గూడుకట్టుకొని ఉన్న భావనలు బహిర్గతమయ్యాయి.
ప్రజాస్వామ్య మూలసూత్రాలకు విరుద్ధమైన మెజారిటీ భావజాలం ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ప్రజల్లో విభజన కనబడుతోంది.
మనం పెరిగే వాతావరణం మానసిక వికాసాన్నిస్తుంది. మహాత్మాగాంధీ ఆచరణను చూసి, ఆయన ఆలోచనలతో ప్రభావితమైన తరం ఒక్కొక్కరుగా మనల్ని వదిలి వెళ్లిపోతున్నారు. పరమత సహనం, సామరస్యం అన్న భావన కనుమరుగౌతోంది. బహుళత్వాన్ని నమ్మే భారత సమాజానికి గాంధీ విచారధార, ఆలోచనా విధానమే శిరోధార్యం.
-సందీప్ పాండే.