మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఓ అసాధారణ వ్యక్తి. అహింసావాదాన్ని బోధించిన ఉపదేశకుడు. అంతేనా... ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగిస్తూనే.. స్వతంత్ర సంగ్రామానికి కొత్త దశదిశ నిర్దేశించారు... మహాత్ముడు. ఆధ్యాత్మిక భారత చరిత్రలో కనిపించిన ఎంతోమంది రుషులు, సాధువుల పరంపరను కొనసాగిస్తూనే పౌరఉద్యమాలకు వెలుగుబాటలు పరిచారు. జాతిని మొత్తాన్ని కదిలించే నినాదాలతో ముందుకు సాగారు. సామాన్యులతోనే అసామాన్యమైన ఉద్యమాలు నిర్మించారు. పిడికెడు ఉప్పుతో రగిలిన దండియాత్రే అందుకు నిదర్శనం.
గతించిన సమయానికి ఆయన దేశ ప్రధానమంత్రి కాదు.... అధికారం కోసం పోరాడే రాజకీయ వేత్తా కాదు... అయినా విదేశీ ప్రముఖులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు పెద్దయెత్తున సంతాపం ప్రకటించారు. ఘన నివాళులు అర్పించారు. ఆయన మరణంపట్ల సానుభూతిని వ్యక్తపరుస్తూ..... దేశ విదేశాల నుంచి దాదాపు 3 వేల 441 సందేశాలు వచ్చాయంటేనే .. అర్థం చేసుకోవచ్చు, ప్రపంచదేశాలు మహాత్ముడిని ఎంతలా ఆరాధించాయో... అనుసరించాయో.
3 సిద్ధాంతాలతోనే...
ఒక్కమాటలో చెప్పాలంటే.. మహాత్ముడు కోట్లాది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మేల్కొలిపిన దార్శనికుడు. తన సిద్ధాంతాలతో.. సమాజంలో సమూల మార్పు, పరివర్తన తీసుకుని వచ్చిన నాయకుడు. స్వరాజ్యం, క్షమాగుణం, ప్రార్థన, మూడు సిద్ధాంతాలనే ప్రాతిపదికగా చేసుకుని.... గాంధీ తన జీవితాన్ని సాగించారు. వినూత్న పద్ధతులతో ప్రజల్లో పోరాటపటిమ తీసుకొచ్చేందుకు కృషి చేశారు. సత్యాగ్రహ, సర్వోదయ్, అహింసా నినాదాలతో ప్రజల్లో స్వాతంత్ర్య భావాలను రేకెత్తించారు.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ అనేక రచనలు చేశారు. రచన అనేది తన ఆలోచనలు ప్రచారం చేసేందుకు ఎంచుకున్నమార్గంగా పేర్కొన్న గాంధీ, తన రచనలు విషపూరితం కావనీ.... అసత్యాలు ఉండవని చెబుతుండేవారు. దుష్ట సంకల్పాన్ని ప్రోత్సహించడం ద్వారా.... లక్ష్యాన్ని సాధించలేమన్న మహాత్ముడు....సత్యం తప్ప మరో మతం లేదని ఉద్భోదించారు. ఆయన ప్రసంగాలు, రచనలు చాలామందిని ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి.
రచనల్లోనూ గాంధీ సిద్ధాంతాలే...
గాంధీ సిద్ధాంతాలను, భావాలను పలువురు రచయితలకు తమ రచనల్లో వ్యక్తీకరించగలిగారు. ముల్క్‌రాజ్ ఆనంద్, ఆర్కే నారాయణ్, రాజా రావు తదితర రచయితలు గాంధీ భావవ్యక్తీకరణల నేపథ్యాన్ని తన రచనల్లో చక్కగా చూపించగలిగారు. తన అన్‌టచబుల్ నవలలో గాంధీ మార్గంలోని అంటరానితనం నిర్మూలన గురించి ప్రస్తావించారు ముల్క్‌రాజ్ ఆనంద్. 1955లో ఆర్కే నారాయణ్ రచించిన వెయిటింగ్ ఫర్ ది మహాత్మలో గాంధీ సిద్ధాంతాలు కనిపిస్తాయి. శాసనోల్లంఘనోద్యమంలో కాంతాపుర గ్రామ ప్రజలు పోషించిన పాత్రను రాజారావు 1938లో తాను రచించిన కాంతాపుర నవలలో ప్రస్తావించారు.
గాంధీ జీవిత సమాహారం....
పాశ్చాత్య విద్యావిధానానికి ప్రభావితులైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్... అనంతరం గాంధీ జీవన విధానం అలవర్చుకున్నారు. మహాత్ముడి నుంచి స్ఫూర్తిని పొంది... నూలు ఒడకటం, ఖాదీ, శాకాహారం వంటి విధానాలను అనుసరించారు. 1956లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో... గాంధీ రచనలు, ప్రసంగాలను సంరక్షించే విధంగా భారత ప్రభుత్వం ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. 'కలెక్టడ్ వర్క్ ఆఫ్ మహాత్మాగాంధీ' పేరిట బాపూజీ జీవిత సమాహారాన్ని 50 వేల పేజీల్లో పొందుపరిచారు.
బాపూజీ సంకలనాలకు ముందుమాట రాసిన.. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపిన గొప్పవ్యక్తి మాటలు ఆ పుస్తకంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరినీ గొప్ప సంకల్పంతో ముందుకు తీసుకెళ్లిన విధానాలు, అనేకుల్ని ప్రభావితం చేసిన మాటలు, వేలాదిమందిలోని ప్రతిభ వెలికితీసిన భావాలు, కొత్త జీవన విధానాన్ని చూపించిన మార్గాలు అందులో నిక్షిప్తమై ఉన్నట్లు కొనియాడారు.
గూగుల్ శోధనలో లక్షలాది రిఫరెన్స్‌లు...
మహాత్మగాంధీ జీవనం, స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన భాగంతో ముడిపడిఉన్న ఎన్నో పుస్తకాలు, జర్నల్స్, కథనాలు, పరిశోధనా నివేదికలు, వార్తాపత్రికల కథనాలు.. ఇప్పటికీ ప్రజల జీవితాల్లోని వేర్వేరుకోణాల్లో ఏదోక సందర్భంలో ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు గూగుల్ శోధనలో మహాత్ముడిపై లక్షలాది రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. దీనిని బట్టి చూసినా 20వ శతాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన, స్ఫూర్తిదాయక, ప్రభావవంతమైన వ్యక్తి గాంధీజీ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ