20వ శతాబ్దికి అసామాన్య దార్శనికులు మహాత్మాగాంధీ. ఆలోచనలు, మాటలు, పనులను ఏకం చేసి అపారమైన శక్తిని సంపాదించారు. రాజీపడని తత్వం, కృషితో ప్రపంచంలో ఎదురులేని మనిషిగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా అణచివేత ధోరణులపై ఉక్కుపాదం మోపేందుకు సత్యం, సత్యాగ్రహం, అహింసావాదాన్ని ఆయుధాలుగా మలిచి విజయం సాధించారు.
కానీ.. అణచివేతదారులు క్రూర విధానాలను పాటించి నైతిక విలువలను ఖాతరు చేయకుంటే.. గాంధీ సూచించిన శాంతి, అహింస మార్గాలు విఫలమయ్యే అవకాశం ఉండేది. మారణహోమం, మూకుమ్మడి హత్యలు, జాతి ప్రక్షాళన, యుద్ధం, ఉగ్రవాదం.. అమాయకులకు వీటివల్ల కలిగే హాని, బాధల నుంచి నియంత్రించేలా కొన్ని ప్రయత్నాలు అవసరమయ్యాయి. అయినప్పటికీ చాలా విషయాల్లో గాంధీజీ విధానాలు పనిచేశాయి. అణచివేత ధోరణి, హింస, ఘర్షణలను ఆయన ఎప్పుడూ తిరస్కరించేవారు.
ఉద్రిక్తతలు తలెత్తితే అందుకు సంబంధించిన సమస్యలను లేవనెత్తేవారు గాంధీ. ఘర్షణలు, అన్యాయం జరగకుండా చూడటంలో ఆయన ప్రతిభ తెలుస్తుంది. అధికార బాధ్యతారాహిత్యం, అన్యాయం వంటి పరిస్థితుల్లో గాంధీ విధాన సామర్థ్యం మనకు తెలుస్తుంది. అందుకే అణగారిన ప్రజలు, సామూహిక ఉద్యమాలకు గాంధీ దగ్గరయ్యారు.
గాంధీ కారణంగా జాతీయోద్యమ కాలంలో భారత ఉపఖండంలో చాలా మంది నేతలు ఉద్భవించారు. ఆయన సందేశాలతో దక్షిణ ఆసియా దేశాలన్నీ ప్రభావితం అయ్యేవి. ఆసియేతర దేశాల్లోనూ గాంధీ ప్రభావం కొనసాగింది.
ఫిలిప్పీన్స్ ప్రజాస్వామ్యం సాధన
ఫిలిప్పీన్స్‌లో బెనిగ్నో అక్వినో జూనియర్ నేతృత్వం వహించిన ప్రజాస్వామ్య ఉద్యమం, ఆయన హత్య తర్వాత కొరాజాన్ అక్వినో నేతృత్వంలో సాగిన పోరాటానికి మహాత్ముడి ప్రేరణలే కారణం. శాంతియుత నిరసనలతో మార్కొస్ పాలనకు అంతం పలికి ఫిలిప్పీన్స్ నిజమైన ప్రజాస్వామ్య వాయువులను పీల్చింది.
దక్షిణ కొరియాలో..
దక్షిణ కొరియాలో దశాబ్దాలుగా కొనసాగిన నిరంకుశమైన సైనిక పాలన శాంతియుత నిరసనలతోనే ముగిసింది. నియంత పాలన అంతమయింది. తీవ్రమైన ఒత్తిడితో 1987లో రాజ్యాంగ పునర్నిర్మాణం జరిగింది. అప్పటినుంచి 2003 వరకు ప్రజాస్వామ్య పాలనకు గట్టి పునాదులు పడ్డాయి. ఇందుకు కారణమైన నాయకులు కిమ్ యంగ్ సామ్, కిమ్ డే జంగ్.. ఇద్దరూ గాంధీ మార్గానికి ప్రభావితమైన వారే. వీరి కృషితోనే స్థిరమైన, శాంతియుత ప్రజాస్వామ్య ఆర్థిక దిగ్గజం(దక్షిణ కొరియా) ఉద్భవించింది. మానవ హక్కులకు ఈ దేశం అధిక ప్రాముఖ్యం ఇస్తుంది.
ఆంగ్‌సాన్ సూకీ అవిశ్రాంత పోరాటం
ఆంగ్‌సాన్ సూకీ.. మయన్మార్ నేత. గాంధీ విధానాలకు ఆమె కూడా ప్రభావితమయ్యారు. 1989-2010 మధ్య కాలంలో 15 ఏళ్లు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమెను దేశం నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. ఆమె అందుకు తిరస్కరించింది. బయటికి వెళ్తే తిరిగి మళ్లీ మయన్మార్‌లో అడుగుపెట్టనివ్వరని సూకీకి తెలుసు. అందుకే నోబెల్ బహుమతి వరించినా, బ్రిటన్‌లో తన భర్త మరణించినా సూకీ ఎక్కడికీ కదలలేదు. గాంధీజీ జీవితం నన్నెంతో ప్రభావితం చేసిందని ఆమె ఎప్పడూ చెబుతుండేది.
"అహింసా మార్గంలోనే మార్పు సాధ్యమని గాంధీ కన్నా ముందు ఎవరూ ఆలోచించలేదు. ఆయనే ఈ మార్గాన్ని మొదట ప్రారంభించారు. అహింసతోనే విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని ఆయన నమ్మారు. "
-ఆంగ్‌సాన్ సూకీ, మయన్మార్ నేత
శాంతి ప్రదాత.. నెల్సన్ మండేలా
నెల్సన్ మండేలా.. ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నేతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. గాంధీ జీవితం, బోధనలు, పద్ధతులతో ఎంతో ప్రభావితమయ్యానని చెప్పేవారు మండేలా.
"గాంధీ సిద్ధాంతాలతోనే 1952 ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి లక్షల మంది దక్షిణ ఆఫ్రికన్లు కదిలివచ్చారు. ప్రజాసమూహంతోనే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన జరిగింది. ఆయన ఒక పవిత్ర యోధుడు. నీతి, నైతిక విలువలను సమ్మిళితం చేసి బ్రిటిష్ సామ్రాజ్య అణచివేతను బలమైన తీర్మానంతో తిరస్కరించారు."
- నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా
మండేలా.. మహాత్ముడే ఆయనకు స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు.
"ప్రపంచంలో హింస, వివాదాలు రాజ్యమేలుతున్న సమయంలో శాంతి, అహింసా సందేశాలు ప్రజలను బతికించాయి. క్రూరమైన అణచివేతదారులకు వ్యతిరేకంగా సత్యాగ్రహమే సరైన ఆయుధమని గాంధీ భావించారు. వారిలోనూ నైతిక భావనలను సృష్టించగలిగారు."
-నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా
నల్ల జాతీయుల రారాజు
న్యాయం కోసం అణగారిన ప్రజలు సత్యం, ప్రేమను ఆయుధాలుగా మలిచి పోరాడాలన్న గాంధీ ఆలోచనను మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రశంసించేవారు. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన ఆయన.. గాంధీ మార్గంలోనే నడిచారు. 1955-56లో మోంట్గొమెరీ బస్ బహిష్కరణకు ఇదే సూత్రాన్ని పాటించారు.
"క్రీస్తు.. మార్గాన్ని చూపారు. భారత్‌లో గాంధీ ఇది పని చేస్తుందని నిరూపించారు. చెడును అహింసతో జయించవచ్చని చూపారు. అహింసా మార్గంలో నడిచే వ్యక్తి ఇతరులను కాల్చడానికే కాదు.. కనీసం ద్వేషించడానికి ఇష్టపడరు."
-మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
1964లో కింగ్‌కు నోబెల్ వరించింది. ఆ సమయంలో గాంధీ నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆయన తెలిపారు. ఇండియాకు 1959లో వచ్చినప్పుడు కింగ్ ఇలా రాశారు.
"అణగారిన ప్రజల స్వాతంత్ర్యోద్యమంలో అహింసా వాదమే సరైనదని నిరూపించిన భారత్‌ను వదిలి వెళుతున్నా."
-మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
దలైలామా
ఆధ్యాత్మిక గురువు దలైలామా.. గాంధీ విధానాలను గౌరవించారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక మార్పులు అహింస మార్గంలోనే సాధ్యపడుతాయని ఉద్ఘాటించారు.
"ఎంతో మంది గాంధీ అహింసావాదం బలహీనమైనది, నిరాశపూరితమైనదిగా భావించవచ్చు. కానీ చాలా దేశాలు ఇప్పుడు మహాత్ముడి అహింసా సిద్ధాంతాల వైపు ఆలోచిస్తున్నాయి."
-దలైలామా, ఆధ్యాత్మిక గురువు
బారాక్ ఒబామా..
"గాంధీజీ సిద్ధాంతాలే నా జీవితం మొత్తానికి స్ఫూర్తినిచ్చాయి. ఆయణ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడిచాను. దయతో ఎంతటి మార్పునైనా సాధించవచ్చని నిరూపించారు. ఏదైనా అద్భుతం జరిగి అవకాశం వస్తే గాంధీతో కలిసి భోజనం చేయాలనేది నా కోరిక. అంతలా ప్రభావితం చేశారు గాంధీ."
- బారాక్ ఒబామా
గాంధీ మార్గంతో పోరాటాలు
గాంధీ విధానాల ద్వారా తన పోరాట వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు మెక్సికో-అమెరికన్ పౌర హక్కుల ఉద్యమ నేత సీజర్ చావెజ్. గాంధీ మార్గంలోనే నడిచిన చావెజ్.. హింసాత్మక దాడులు జరిగినా అహింసావాదానికి కట్టుబడి ఉన్నారు.
"అహింసపై మాట్లాడటమే కాదు.. న్యాయం, స్వేచ్ఛ ఎలా సాధించాలో గాంధీ చూపించారు. "
- సీజర్ చావెజ్
అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీ సాగించిన పోరాటం శతాబ్దం పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఆయన జీవిత సందేశం మన భవిష్యత్తు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. గాంధీ బోధనలతోనే మహిళా స్వేచ్ఛ, పర్యావరణ ఉద్యమాలు సాధ్యమయ్యాయి. ఆధునిక ప్రపంచం గాంధీకి ఎంతో రుణపడి ఉంది. ఆయన బోధనలు, విధానాలే మనల్ని నడిపిస్తున్నాయి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవటం, ఇతరులతో మర్యాదగా మెలగటం ఇలాంటి మార్పులు సంభవించాయి.
(రచయిత-జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా పార్టీ అధినేత)