కరోనా కాలంలో వినాయక చవితి పండుగను ఆరోగ్యమయం చేసే ఆలోచన చేశాడు రాజస్థాన్‌కు చెందిన ఓ కళాకారుడు. గణనాథుడి విగ్రహాలతోనే రోగ నిరోధక శక్తిని అందించే ఉపాయం చేశాడు. సుగంధ ద్రవ్యాలతో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
జైపుర్‌కు చెందిన శివచరణ్ యాదవ్ ఏటా విత్తనాలు, ఆవు పేడ వంటి ప్రకృతి పదార్థాలతో పర్యావరణహిత వినాయకులను తయారుచేసేవాడు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వినాయకులకు డిమాండ్ తగ్గింది. దీంతో, కొవిడ్‌కు భయపడకుండా, భక్తులకు ఉపయోగపడే విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు శివచరణ్. అందుకే, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, పసుపు వంటి సుగంధద్రవ్యాలతో వినాయకుడిని రూపొందించాడు.
అయితే, ఈ సుగంధ ద్రవ్యాల గణనాథులను పూజించి.. నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద గుణాలున్న మసాలా దినుసులను భద్రపరచుకుని, రోజూ కషాయం చేసుకుని తాగితే కరోనా పరారే అంటున్నాడు శివచరణ్.
"రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద పదార్థాలతో గణేశులను తయారు చేశాం. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు కషాయం తీసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ ఆలోచన చేశాం. ఈ సారి, మట్టి వినాయకులకు కూడా డిమాండ్ తక్కువగా ఉంది. అందుకే, మసాలాలతో దాదాపు 20 ఎకో- ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేశాం. "
-శివచరణ్, కళాకారుడు
ఇదీ చదవండి: కనిపించని గణేశ్ చతుర్థి శోభ.. ఆలయాల్లోనే పూజలు!