కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఆర్థిక, సామాజిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ ప్రభావం అంతరిక్ష పరిశోధనపైనా తీవ్రంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్, చంద్రయాన్ సహా ఈ ఏడాది ప్రయోగించాల్సిన 10 ప్రాజెక్టులపై లాక్డౌన్ ప్రభావం పడినట్లు సంస్థ ఛైర్మన్ కే శివన్ తెలిపారు. అంతరిక్ష మిషన్స్‌పై లాక్డౌన్ ప్రభావం ఏ మేరకు ఉందో ఇస్రో అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
" కరోనా మహమ్మారి చాలా రంగాలపై ప్రభావం చూపింది. కొవిడ్-19 సమస్య పరిష్కారమైన తర్వాత మేము ఓ అంచనాకు వస్తాం. పరిశ్రమలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను ప్రారంభించకపోవటం వల్ల లాక్డౌన్ ప్రభావం గగన్‌యాన్‌పైనా ఉంటుంది. కొన్ని నెలలుగా అంతరిక్ష మిషన్స్ పనులు నిలిచిపోయాయి. చంద్రయాన్-3 సహా మా అన్ని మిషన్స్ ప్రభావితమయ్యాయి. "
- కే శివన్, ఇస్రో ఛైర్మన్
ఇస్రో తనకు కావాల్సిన ఉపకరణాల కోసం ఎక్కువగా ప్రైవేటు రంగంపైనే ఆధారపడుతోంది. అధికంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరికరాలను సమకూర్చుతుంటాయి. లాక్‌డౌన్‌తో ఈ రంగాలు తీవ్రంగా ప్రభావితమవటం వల్ల.. ఇస్రో ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం పడింది.
చంద్రయాన్-2 ప్రయోగం ల్యాండింగ్‌లో లోపం తలెత్తి విఫలమైన తర్వాత.. చంద్రయాన్-3కి ప్రణాళిక చేసింది ఇస్రో. ఈ ఏడాది చివరి లోపు ప్రయోగించాలని నిర్ణయించింది. అలాగే.. మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి రష్యాలో శిక్షణ ఇస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టులపై లాక్డౌన్ ప్రభావం చూపింది.
ఇదీ చూడండి: పాకిస్థాన్‌ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం