అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతున్న వ్యక్తి టీటీవీ దినకరన్. ఆయన పార్టీ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం.' ఎన్నికల గుర్తు గిఫ్ట్ ప్యాక్.
ఇవీ చూడండి:
భారత్ భేరి: రాజకీయ వినోదం @ ట్విట్టర్
భారత్ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా
- దివంగత జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్.
- అన్నాడీఎంకేలో కోశాధికారిగా అనుభవం. గతంలో రాజ్యసభ, లోక్‌సభకు ప్రాతినిధ్యం.
- శశికళ జైలుకెళ్లే ముందు 2017 ఫిబ్రవరి 15న అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియామకం.
- 2017 ఆగస్టులో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ
- 2107 డిసెంబర్లో ఆర్కే నగర్ ఉపఎన్నికలో గెలుపు
- 2018 మార్చి 15న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ స్థాపన
అమ్మ వారసుడిగా!
జయలలిత మరణం తర్వాత... అన్నాడీఎంకేలో దినకరనే కీలకం అవుతారని భావించారంతా. కానీ... తమిళ రాజకీయాల్లో నాటకీయ మలుపులతో పరిస్థితి తారుమారైంది. చివరకు... 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం-ఏఎంఎంకే' పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు దినకరన్.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విజయంతో వ్యక్తిగతంగా తానేంటో నిరూపించుకున్నారు దినకరన్. ఇప్పుడు పార్టీపరంగా సత్తా చాటే సమయం వచ్చింది. అందుకు ముహూర్తం ఏప్రిల్ 18. ఆ రోజు తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలు, 18 శాసనసభ స్థానాలకు పోలింగ్.
కొత్త పార్టీ అయినా...
తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నా.... అన్నాడీఎంకే పోటీ చేస్తోంది 20 స్థానాల్లోనే. మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించింది. డీఎంకేదీ అదే కథ.
దినకరన్ పార్టీ మాత్రం 38 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎస్డీపీఐకి కేటాయించింది. ఉపఎన్నికలు జరిగే 18 సీట్లలోనూ పోటీకి దిగింది ఏఎంఎంకే.
దినకరన్‌ది కొత్త పార్టీ. సంస్థాగత నిర్మాణం పూర్తి కాలేదు. అయినా... ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా విశేష స్పందన వస్తోంది. అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పాల్గొంటున్న ప్రచార సభలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ పరిణామం అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.
'గుర్తు'లేక ఓట్ల బదిలీ...?
దక్షిణ, తూర్పు తమిళనాడులో దినకరన్‌కు మంచి ఆదరణ ఉంది. కొన్ని స్థానాలను ఆయన పార్టీ గెలుచుకోగలదని అంచనా. ఉత్తర తమిళనాడులో అన్నాడీఎంకే ఓట్లు చీల్చి... డీఎంకే విజయానికి ఉపకరించే అవకాశముంది.
అన్నాడీఎంకే 19 లోక్‌సభ నియోజకవర్గాల్లోనే పోటీ చేయడం ఏఎంఎంకేకు మరో సానుకూలాంశం. మిగిలిన 20 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కనిపించకపోతే ఆ పార్టీ మద్దతుదారులు దినకరన్వైపే మొగ్గుచూపే అవకాశముంది.
భాజపాతో అన్నాడీఎంకే పొత్తు నేపథ్యంలో మైనార్టీల ఓట్లు తమకే పడతాయని లెక్కలు వేసుకుంటోంది ఏఎంఎంకే.
అసలు లెక్క వేరే...
దినకరన్ అసలు లక్ష్యం సాధ్యమైనన్ని శాసనసభ స్థానాలు దక్కించుకోవడమే. ఇందుకు కారణం... ఆ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితే. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 235. ప్రస్తుతం 22 ఖాళీలున్నాయి. మిగిలినవాటిలో అన్నాడీఎంకే బలం 113. డీఎంకేకు 88, కాంగ్రెస్‌కు 8మంది సభ్యులు ఉన్నారు. మిగిలినవి చిన్నపార్టీల సభ్యులు, ఇతరులవి. ఇప్పుడు ఉపఎన్నికల్లో దినకరన్ పార్టీ ప్రభావం చూపితే... రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది.
- అన్నాడీఎంకే విఫలమైతే? : దినకరన్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంపై చర్చ జరుగుతుంది. ఆయన్ను అన్నాడీఎంకేలోకి తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ వస్తుంది. ఏఎంఎంకే ప్రభావం పెద్దగా లేకపోతే... అన్నాడీఎంకేలో పళనిస్వామి-పన్నీర్‌సెల్వం హవా కొనసాగుతుంది.
- విలీనం: అత్యధిక స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు గెలిస్తే దినకరన్ దూకుడు పెంచుతారు. తెరవెనుక వ్యూహాలతో అన్నాడీఎంకే పగ్గాలను చేజిక్కించుకునే అవకాశముంది.
- బేరసారాలు: ఉపఎన్నికలు జరిగే 18 శాసనసభ స్థానాల్లో ఏఎంఎంకే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఈపీఎస్-ఓపీఎస్ వర్గం దినకరన్‌తో బేరసారాలకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన సీట్లు అన్నాడీఎంకేకు లేకపోతే... చర్చల ప్రతిపాదనను దినకరన్ తిరస్కరిస్తారని అంచనా. తద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకేకు మద్దతిచ్చే అవకాశముంది. తమిళనాడులో అన్నాడీఎంకే, కేంద్రంలో భాజపా పాలనకు తెరదించడమే లక్ష్యమని దినకరన్ ప్రచార సభల్లో పదేపదే చెబుతున్నారు.
మే 23 వరకు దినకరన్ సహా తమిళ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
ఇవీ చూడండి: