'రుద్ర' గుహలు.. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయానికి.. ఒక కిలోమీటరు దూరంలో ఉన్నాయి. చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. ధ్యానానికి యోగ్యమైన ప్రాంతం. అసలు వీటి పేరు కూడా మొన్నటి వరకు చాలా మందికి తెలియదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమా అని రుద్ర గుహలు ఇప్పుడు ప్రపంచ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.
2018 నుంచి ఈ గుహలను ప్రజలు సందర్శించేందుకు అనుమతించారు. అయితే మోదీ ఇక్కడకు రాక ముందు వీటికి కేవలం ఒకే ఒక బుకింగ్ వచ్చింది. మోదీ ఇక్కడకు వచ్చి వెళ్లాక ఈ గుహలకు 78 ముందస్తు బుకింగ్‌లు వచ్చాయి.
"భారత పర్యటక ప్రాంతాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెద్ద ప్రచారకర్త. ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ప్రాంతాలు విపరీతంగా ప్రచారమవుతాయి. ఆయన సందర్శించిన ఈ రుద్ర గుహలు.. పర్యటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మొదటిసారి వీటికి ముందస్తు బుకింగ్‌లు నమోదయ్యాయి." - ప్రహ్లాద్ పటేల్, కేంద్ర పర్యటక మంత్రి
కేదార్‌నాథ్‌లో మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఈ గుహలకు నాలుగు బుకింగ్‌లు వచ్చాయి. జూన్‌లో 28, జులైలో 10, ఆగస్టులో 8, సెప్టెంబర్‌కు 19, అక్టోబర్‌కు 10 ముందస్తు బుకింగ్‌లు నమోదయ్యాయి.
ఈ గుహలను ఒక రాత్రికి బుకింగ్ చేసుకోవాలంటే రూ.1500, ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు అయితే రూ.999 చెల్లించాలి.
సౌకర్యాలు...
ప్రశాంతంగా ఉండే ఈ గుహల్లోకి ధ్యానం కోసం ఒక్కొక్కరిని మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వినియోగించుకునేందుకు ఒక ఫోన్ అందుబాటులో ఉంటుంది. విద్యుత్, తాగునీరు సదుపాయాలు ఉన్నాయి.
అటాచ్డ్ టాయిలెట్, హీటర్ వంటి అధునాతన సౌకర్యాలున్నాయి. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, రాత్రి భోజనం వీరే అందిస్తారు. సహాయకులను పిలిచేందుకు ఒక బెల్ ఏర్పాటు చేశారు. ఏదైనా అవసరమైతే దాన్ని మోగిస్తే సహాయకులు వస్తారు.
2019 మే18న మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించారు. అక్కడ దగ్గరలోని రుద్ర గుహల్లో ధ్యానం చేశారు. ఆ వార్త ప్రపంచ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. మోదీ గుహలో ధ్యానం చేసే ఫోటోలు వైరల్ అయ్యాయి.