71వ గణతంత్ర దినోత్సవానికి భారతీయులు సన్నద్ధమవుతున్న వేళ.. దేశ రాజధాని దిల్లీలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఫేషియల్ రికగ్నీషన్ వ్యవస్థ, డ్రోన్ల సహాయంతో నిత్యం అప్రమత్తంగా ఉండనున్నారు.
స్నైపర్లు... షూటర్లు...
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో పాల్గొననున్నారు. పరేడ్‌కు దేశంలోని అగ్రనేతలు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. పరేడ్ జరిగే రాజ్‌పథ్-ఎర్రకోట మార్గంలో షూటర్లు- స్నైపర్లతో నిఘా ఉంచారు.
వందలాది సీసీటీవీ కెమెరాలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందినీ చౌక్, యమునా ఖాదర్ ప్రాంతాల్లో దాదాపు 150 కెమెరాలను సిద్ధం చేశారు. నాలుగంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు డీసీపీ ఐష్ సింఘాల్ తెలిపారు.
"రాజధానిలో నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశాం. దాదాపు 6వేల మంది పోలీసులను న్యూదిల్లీ జిల్లా వ్యాప్తంగా మోహరించాం. 50 కంపెనీలకు చెందిన పారామిలిటరీ బలగాలూ రంగంలోకి దిగాయి."
--- ఐష్ సింఘాల్, డీసీపీ
హొటళ్లు, టాక్సీలు, ఆటో డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. రిపబ్లిక్ డే పరేడ్‌తో పాటు రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్‌హోం వేడుకకూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో రవాణాపై ఆంక్షలు విధించగా.. మరికొన్ని చోట్ల దారి మళ్లించనున్నారు. రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా 2వేలకుపైగా ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి:- చెక్కతో చేసిన టూత్ బ్రష్, కాగితపు స్ట్రాలు చూశారా?