అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల తర్వాత మహమ్మారి కోరలకు అత్యంత దారుణంగా చిక్కింది భారత్. వేగంగా పెరుగుతున్న కేసులతో సతమతవుతున్నారు ప్రజలు. అయితే, కరోనా పరీక్షల సామర్థ్యం పెరగడం, జనాల్లో నిర్లక్ష్యం తాండవించడమే ఇందుకు కారణమంటున్నారు వైద్య నిపుణులు.
స్పీడు పెరిగింది..
దేశంలో కరోనా వ్యాప్తి వేగవంతమైంది. తొలుత నెమ్మదిగా నమోదైన కేసులు రోజులు గడుస్తున్న కొద్దీ స్పీడు పెంచాయి.
- దేశంలో జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైంది.
- మొదటి కేసు నమోదైన రోజు నుంచి 110 రోజుల తర్వాత అంటే మే 19న లక్ష కేసులు దాటాయి. మరో 14 రోజుల్లో జూన్ 3న రెండు లక్షలు క్రాస్ అయ్యింది.. ఇక జూన్ 27న ఐదు లక్షల కేసుల మార్క్ దాటేసింది. అంటే కేవలం పాతిక రోజుల్లో 3,18,418 కొత్త కేసులు నమోదయ్యాయి.
- నాలుగు లక్షల కేసులు నమోదైన ఆరు రోజులకే మరో లక్ష కేసులు వెలుగు చూశాయి.
- శనివారం ఉదయానికి 24 గంటల్లో 18,552 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. 384 కొవిడ్ మరణాలు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 15, 685కు చేరింది.
- మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, దిల్లీ రాష్ట్రాలు.. అత్యధిక కేసులతో సతమతమవుతున్నాయి.
లాక్డౌన్ ఎత్తేయడమే కారణమా?
డాక్టర్ అరవింద్ కుమార్, డాక్టర్ మోనికా మహాజన్‌ల ప్రకారం లాక్డౌన్ సడలింపుల తర్వాత కేసులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లాక్డౌన్ తర్వాతే కేసుల రేటు పెరిగిందంటున్నారు వైద్య నిపుణులు.
- దేశంలో మార్చి 25న తొలిసారిగా 21 రోజులపాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత మే 3, మే 17, మే 31 ఇలా పొడగిస్తూ వచ్చింది.
- దాదాపు రెండు నెలల తర్వాత మొదటి సడలింపుల్లో భాగంగా ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా కార్యకలాపాలకు అనుమతిచ్చింది.
- ప్రస్తుతం దేశంలో కంటైన్మెంట్జోన్లలో మాత్రమే లాక్డౌన్ అమలవుతోంది. అది కూడా జూన్ 30 వరకు కొనసాగనుంది.
- ప్రజల్లో కరోనా అంటే భయం పోయింది. సామాజిక దూరం, మాస్కులు గట్రా పెట్టుకోకుండానే తిరిగేస్తున్నారు. విందులు, వినోదాలకు హాజరవుతున్నారు.
- కొవిడ్ సోకినా లక్షణాలు కనిపించని వ్యక్తులు.. యథేచ్ఛగా తిరగడం వల్ల తమ చుట్టుపక్కల వారికి వ్యాపించింది.
సామర్థ్యం పెరిగింది.....
లాక్డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి పెరిగింది. ప్రభుత్వం పెంచిన వైద్య వసతుల వల్ల ఆ కేసులు వేగంగా బయటపడుతున్నాయంటున్నారు నిపుణులు.
- ఇప్పటి వరకు దాదాపు 79,96,707 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్క రోజే 2,20,479 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
- టెస్టింగ్ కిట్ల కొరత తీరిపోయింది. దీంతో టెస్టింగ్ సామర్థ్యం పెరిగింది. మే 25న 1.4 లక్షల కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పుడిప్పుడే రోజుకు 3 లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఇదివరకు కరోనా నిర్థరించేందుకు పుణెలోని ఒక్క జాతీయ ల్యాబ్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు దాదాపు 1007 టెస్టింగ్ ల్యాబ్‌లను ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. వాటిలో 734 ప్రభుత్వ ల్యాబులే.
- పూర్తి వసతులున్న ల్యాబ్‌లో కరోనా నిర్థరణ పరీక్షలు పూర్తి చేసేందుకు కేవలం 4-5 గంటల సమయం పడుతుందని ఐసీఎమ్ఆర్ తాజాగా వెల్లడించింది.
- అంతేకాకుండా 30 నిమిషాల్లో ఫలితాలను ఇచ్చే రాపిడ్-యాంటీజెన్ పరీక్షలను కూడా, ఇటీవల ఐసీఎంఆర్ ఆమోదించింది.
ఇదీ చదవండి: 'కర్తార్‌పుర్ నడవా పునరుద్ధరణ పాక్ కపట నాటకమే!'