మన దేశంలో పాత్రికేయం సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ ఏకపక్షం (వన్ వే ట్రాఫిక్) కాకూడదని పేర్కొంది. తప్పుడు-కల్పిత కథనాలకు పాత్రికేయంలో స్థానం లేదని వ్యాఖ్యానించింది.
'ది వైర్' వార్తా పోర్టల్‌తోపాటు ఆ సంస్థకు చెందిన కొందరు పాత్రికేయులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ గవయీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
న్యాయస్థానాలు.... వివరణ కోరుతూ వ్యక్తులకు తాఖీదులు పంపిన తరువాత వార్తలను ప్రచురించేందుకు కొన్ని వార్తా సంస్థలు కనీసం 5-6 గంటలు కూడా వేచి ఉండకపోతుండడాన్ని న్యాయస్థానం తీవ్రంగా విమర్శించింది. ఇదేం పాత్రికేయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీళ్లను ఉపసంహరించుకునేందుకు ది వైర్, పాత్రికేయులను న్యాయస్థానం అనుమతించింది.
ఇదీ చూడండి: గాంధీ-150: జయాపజయాలు ఒకేచోట పరిచయం