లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి సాయంగా రేషన్ కార్డులు లేని వారికి ఉచిత రేషన్ సరకులు అందించింది కేంద్రం. అయితే ఇవి కేవలం 2.14కోట్ల మందికే అందినట్లు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 8కోట్ల మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 5కిలోల ఆహార ధాన్యంతో పాటు కుటుంబానికి కిలో పప్పు అందించినట్లు కేంద్రం ప్రకటించింది.
అయితే పలు రాష్ట్రాలు ఈ మేరకు సరకులు పంపిణీ చేయలేకపోయాయని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. గోవా, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కరికి కూడా ఈ రేషన్ ఇవ్వలేదన్నారు. బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కిం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లలో జూన్ నెలలో ఆహార ధాన్యాలు పంపిణీ చేయలేదని అన్నారు. వలస కార్మికులు అప్పటికే సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్ల సరకులు పంపిణీ చేయలేకపోయినట్టు ఈ రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయన్నారు.
మే నెలలో 1.21కోట్ల మంది వలస కూలీలకు 60,810టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయగా.. జూన్‌లో 92.44 లక్షల మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు పాండే. మే నెలలో అత్యధికంగా రాజస్థాన్‌లో 42.27లక్షల మంది లబ్ధిపొందగా.. మహారాష్ట్ర (15.36లక్షలు), కర్ణాటక(12.31) తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. జూన్‌లోనూ రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉండగా.. బంగాల్, హరియాణాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. మరో ఏడుగురు మృతి