ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగం 'గగన్‌యాన్' కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా.. భారత వైద్యులకు ఫ్రాన్స్ రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనుంది. 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో గగన్‌యాన్ ప్రాజెక్టును ప్రారంభించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిపుణులకు శిక్షణ కీలకం కానుంది.
భారత వాయుసేనకి వైద్యులుగా ఉంటూ.. ఏవియేషన్ మెడిసిన్‌లో నిపుణులైన సర్జన్లను షార్ట్ లిస్ట్ చేసి ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేయనున్నారు. వారికి రెండు వారాలపాటు ఫ్రాన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఇస్రో తెలిపింది.
2018లోనే ఒప్పందం
ఫ్రాన్స్‌లో అంతరిక్ష వైద్యసేవల పరంగా మంచి యంత్రాంగం ఉంది. సీఎన్ఈఎస్ అనుబంధ సంస్థ మెడెస్ స్పేస్ క్లీనిక్ కూడా ఉంది. ఇక్కడ స్పేస్ సర్జన్లు శిక్షణ పొందుతారు. అయితే శిక్షణ నిమిత్తం వ్యోమగాములను ఫ్రాన్స్‌కు పంపాలా.. వద్దా అనే అంశంపై భారత్ సమగ్రంగా చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అన్ని పరీక్షలను నెగ్గి ఎంపికైన నలుగురు వ్యోమగాములు రష్యాలో 11నెలల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించే కొన్ని నెలల ముందు.. 2018 మార్చిలో భారత్- ఫ్రాన్స్ పరస్పర అంతరిక్ష సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇదీ చూడండి:- హృతిక్‌ను అభిమానించినందుకు భార్యను చంపిన భర్త!