నాలుగేళ్లు.. అంటే అప్పుడే పాఠశాలకు వెళ్లే వయసది. ముద్దు ముద్దు మాటలతో అక్షరాభ్యాసం చేసేందుకు ఆరంభ తరుణమది. ఈ వయసులోనే అద్భుత ప్రతిభతో అదరగొడుతోంది ఒడిశాకు చెందిన ఓ బాలిక. ఒడిశా బ్రహ్మాపుర్కు చెందిన జిగ్యాన్స మోహంతి.. తన రాష్ట్రంలోని జిల్లా పేర్లు, దేశంలోని రాష్ట్రాలు- వాటి రాజధానులను చకచకా చెప్పేస్తోంది. కవులు-రచనలు, శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు, ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను ఏ మాత్రం తడబాటు లేకుండా అలవోకగా వల్లె వేస్తూ.. ఔరా అనిపిస్తోంది. ఇలా పసి వయసులోనే అపారమైన ప్రతిభ కనబరుస్తోన్న ఈ చిన్నారిని.. స్థానికులు 'గూగుల్ గర్ల్'గా పిలుస్తున్నారట.
అత్తయ్య సహకారంతో..
గంజాం జిల్లా కుకుడాహండీ ప్రాంతానికి చెందిన జితేంద్ర మోహంతి కుమార్తె జిగ్యాన్స.. నాట్యం నేర్చుకునేందుకు బ్రహ్మాపుర్లోని అత్తయ్య విష్ణుప్రియ వద్ద ఉంటోంది. ఈ చిన్నారి తెలివితేటలను గమనించిన ఆమె.. జిగ్యాన్స జ్ఞానానికి మరింత పదును పెట్టేలా చేసింది.
జిగ్యాన్స అసాధారణ ప్రతిభా పాటవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు విష్ణుప్రియ. ఆ చిన్నారి వీడియోలు వైరల్గా మారి.. ఆమెకు 'గూగుల్ గర్ల్' అనే పేరును తెచ్చిపెట్టాయంటున్నారు.
ఇదీ చదవండి: 'అగ్గిపెట్టెల సేకరణ'లో ఆ బాలిక ఛాంపియన్