భాజపా కీలక నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం 12:07 గంటలకు దిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు.
క్యాన్సర్‌తో పోరాటం...
గతేడాది కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు జైట్లీ. ఆయనకు మృదుకణజాల క్యాన్సర్ ఉన్నట్లు ఈ ఏడాది ఆరంభంలో వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం నెల రోజులు అమెరికా వెళ్లి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
గుండె, మూత్రపిండ సమస్యలతో ఆగస్టు 9న మరోమారు తీవ్ర అస్వస్థతకు గురై, దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
చెరగని ముద్ర...
భాజపాలోని కొద్ది మంది శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా పేరు సంపాదించారు జైట్లీ. వాజ్‌పేయీ, నరేంద్రమోదీ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ హయాంలో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
జీవితం...
1952 డిసెంబర్ 28న దిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి.. మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది.
- అరుణ్ జైట్లీ దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు. బీకామ్ హానర్స్‌లో డిగ్రీ, న్యాయ శాస్త్ర పట్టా పొందారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
- వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
- వాజ్‌పేయీ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం న్యాయశాఖ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలు అందించారు.
- 2009-14 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
- 2014 సార్వత్రిక ఎన్నికలలో అమృత్సర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు జైట్లీ. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈయనపై విజయం సాధించారు.
- మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక, రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, వాణిజ్యం పరిశ్రమలు శాఖ, న్యాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు.
గత ప్రభుత్వంలో మోదీ కేబినెట్లో జైట్లీ కీలకమైన వ్యక్తి. ఎన్డీఏ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వటంలో జైట్లీ దిట్ట. భారతీయ జనతా పార్టీలో ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరు. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో జైట్లీది ప్రధాన పాత్ర. వస్తు, సేవల పన్ను, ముమ్మారు తలాక్ నిషేధంలో కీలకంగా వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.
ఇదీ చూడండి: జైట్లీ మార్క్ రాజకీయం... విద్యార్థి దశ నుంచే...