ఛత్తీస్గఢ్ దంతెవాడ ఎమ్మెల్యే భీమా మండావి, నలుగురు పోలీసుల హత్యలో ప్రమేయమున్న ఓ మావోయిస్టును భద్రతా దళాలు హతమార్చాయి. సుక్మా జిల్లా తంగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిస్సీడబ్బా అటవీ ప్రాంతంలో శుక్రవారం నక్సలైట్లు, బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రత దళాల కాల్పుల్లో హతమైన మావోపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది.
నక్సలైట్ల ఏరివేతకు జిల్లాలోని మిస్సీ డబ్బా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బలగాలు రెండు రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశాయి. శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఉదయం 10గంటల ప్రాంతంలో నక్సలైట్లు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఘటనా స్థలంలో నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కాటేకల్యాన్ ఏరియా మావోయిస్ట్ కమిటీ సభ్యుడు హుర్రాగా గుర్తించారు. 303 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న రక్తపు గుర్తుల ప్రకారం మరికొంత మంది మవోలు గాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్ 9న దంతెవాడ జిల్లాలోని శ్యామ్గిరి గ్రామంలో మందుపాతర పేల్చిన ఘటనలో భాజపా ఎమ్మెల్యే భీమా మండావి, నలుగురు పోలీసులు మరణించారు.
ఇదీ చూడండి: రైలెక్కుతూ జారిపడ్డ మహిళ- రక్షించిన జవాన్