ఫొని తుపాను సృష్టిస్తున్న విధ్వంసంతో ఒడిశా, బంగాల్‌లలో హై అలర్ట్ ప్రకటించారు. బంగాల్ ప్రభుత్వం తుపాను పట్ల అప్రమత్తమైంది. ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు నావికా, వైమానిక దళాలు సన్నద్ధమయ్యాయి. ఒడిశా తీర ప్రాంతంలో యుద్ధనౌకలు మోహరించాయి.
ఈ ఉదయం ఒడిశా పూరి వద్ద తీరం దాటిన ఫొని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వేలాది వృక్షాలు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమవుతున్నాయి.
ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. రహదారికి అడ్డంగా కూలిపోయిన వృక్షాల్ని తొలగిస్తున్నారు. 11 లక్షలకు మందికి పైగా నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరి కోసం ప్రభుత్వం 4 వేలకు పైగా పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు...
మొత్తం 34 విపత్తు సహాయక బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.
ఫొని మళ్లీ బాలాసోర్ వద్ద సముద్రంలోకి వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం కోల్‌కతాను దాటి బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. బంగ్లాదేశ్‌కు వెళ్లేలోపే తుపాను క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: వీవీప్యాట్ రసీదుల లెక్కపై వచ్చేవారం విచారణ