మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. పుణెలో వర్షాల ధాటికి రోడ్లపైకి భారీగా నీరు చేరుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో వరదలు పోటెత్తాయి.
వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పుణె, ఔరంగబాద్, కొంకణ్ డివిజన్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
భారీ వర్ష ముప్పు
రాష్ట్రానికి భారీ వర్ష ముప్పు ఇంకా పొంచి ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రజలకు తగిన రీతిలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
"రాబోయే రోజుల్లో మరిన్న వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సంక్షోభం పూర్తయిన తర్వాత ఏ విధమైన సహాయాన్నైనా అందిస్తాం. ఇప్పుడే దీనిపై నేను ప్రకటన చేయడం లేదు."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటం మానేయాలని విపక్ష భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కేంద్రం విదేశీ ప్రభుత్వమేమీ కాదని, రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. వరద సహాయంపై రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.