గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వడోదరా ప్రాంతంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. వడోదరా నగరం, సెంట్రల్ గుజరాత్ ప్రాంతాల్లో బుధవారం నుంచి 24 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
భారీ వర్షాలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 5 వేల 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
స్తంభించిన రవాణా వ్యవస్థ...
వరుణుడి ప్రతాపానికి రవాణా వ్యవస్థ దెబ్బతింది. వడోదరాలోని రోడ్లు జలమయమయ్యాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. గురువారం సాయంత్రం వరకు వడోదరా విమానాశ్రయం మూతపడే ఉంది.
వడోదరాలో భారీ వర్షాలకు విశ్వామిత్రి నది ఉప్పొంగి నగరంలోని వివిధ ప్రాంతాలకు వరద నీరు చేరుకుంది. దాదాపు 600కు పైగా మొసళ్లకు నిలయం ఆ నది.
పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారులను ఆదేశించారు.
ఇదీ బిహార్, అసోం పరిస్థితి...
కొన్ని రోజుల ముందు బిహార్, అసోం రాష్ట్రాలపై తన ప్రతాపాన్ని చూపించిన వరుణుడు ఎట్టకేలకు శాంతించాడు. అసోంలోని ప్రధాన నదుల్లో నీటి శాతం తగ్గుముఖం పట్టింది. బిహార్‌లో భారీ వర్షాలకు 130 మంది మృతిచెందారు. మొత్తం 88 లక్షల 46వేల మందిపై వర్షాల ప్రభావం పడింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షిస్తున్నాయి.
ఇదీ చూడండి: 2 నెలల పాటు సాధారణ వర్షపాతం: ఐఎమ్‌డీ