చేపల వేట దేనికని ఎవరినైనా అడిగితే... కూర వండుకుని తినడానికి అని ఠక్కున సమాధానం వస్తుంది. మరి మీరే చేపల వేటకు వెళతారా అంటే... అమ్మేవారి నుంచి కొనుక్కుంటాం అంటారు కదూ! కానీ కన్నడిగులు మాత్రం స్వయంగా పట్టిన చేపలను దేవుడికి నైవేద్యంగా అర్పించి పూజలు చేస్తారు. అనంతరం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.
కర్ణాటకలోని మంగళూరు దగ్గర్లో 'ధర్మరసు ఉల్లయ' ప్రసిద్ధి చెందిన దేవాలయం. నందినీ నదీ తీరంలో ఉండే ఈ క్షేత్రంలో శివుడిని ఉల్లయగా పూజిస్తారు. దేవాలయం వద్ద ఉన్న రేవులో సాధారణ రోజుల్లో చేపలు పట్టడం నిషిద్ధం. దేవుడే అక్కడ చేపలు పడతాడని భక్తుల నమ్మకం. కానీ ఏటా నిర్వహించే చేపల పండగ రోజు ఇక్కడ అందరూ చేపలు పట్టొచ్చు. రాశి మారేందుకు గుర్తుగా ఈ పండగను నిర్వహిస్తారు.
దివిటీ వెలిగినంత సమయంలోనే...
పండగ రోజు ప్రత్యేక పూజల అనంతరం పూజారి దేవుడి ప్రసాదాన్ని నది వద్దకు తీసుకువచ్చి, దివిటీని వెలిగిస్తారు. అది చేపలు పట్టేందుకు సమయమని సూచన. వెంటనే ఒక్కసారిగా తీరం వెంట గుమిగూడిన వారంతా నదిలోకి దూకి చేపలు పడతారు. దివిటీ మండినంత సమయం వారు చేపలు పట్టవచ్చు.
వ్యవసాయం...ఆరంభం
వలలు, గేలాలు, చేతిదుస్తులు ఎవరికి తోచిన రీతిలో వారు చేపల వేట కొనసాగిస్తారు. ఇది తుళునాట ప్రత్యేక పండగ. ఈ ఉత్సవంతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. రైతులు వ్యవసాయ పనులను ఆరంభిస్తారు. పండుగ అనంతరం ఈ తీరంలో ఎవరూ కనిపించరు.
స్థల పురాణం
పురాతన కాలంలో శివుడు 800 ఏళ్ల పాటు ఇక్కడి తీరంలో పడవలో నివసించాడని ప్రతీతి. బ్రాహ్మణ వేషం ధరించి దేవుడు తమ ప్రాంతానికి రావడం వల్ల పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం.
ప్రతీ ఏటా చేపలు పట్టేందుకు ఇక్కడకి వస్తుంటాం. ఉదయం ఆరు గంటలకే భక్తులు చేరుకుంటారు. సంప్రదాయంగా కేటాయించిన సమయం కోసం వేచి చూస్తారు. సమయం ఆసన్నం కాగానే ఒక్కసారిగా నదిలోకి దూకుతారు. ఇక్కడి చేపలు అత్యుత్తమమైనవి. ఇది అందరికీ సంతోషకరమైన రోజు. స్థానికులు సహా దూరప్రాంతాలనుంచి ఇక్కడికి వస్తారు. -జార్జి డిసౌజా, భక్తుడు
ఇదీ చూడండి: ప్రధాని 'ఆధ్యాత్మిక, అభివృద్ధి' యాత్ర