తన చుట్టూ ఉన్న చీకటిని కృషి అనే ఇంధనం, విజయమనే కాంతితో చీల్చుతూ ముందుకు సాగుతున్నారు ప్రాంజల్ పాటిల్, ఐఏఎస్. కేరళ తిరువనంతపురం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు ఆమె. దృష్టిలోపంతో ఈ విధుల్లో చేరిన తొలి అధికారిణిగా చరిత్ర సృష్టించారు.
ప్రాంజల్ ఇప్పటివరకు ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా పదోన్నతితో సబ్‌కలెక్టర్ బాధ్యతలతో పాటు ఆర్డీఓగా సేవలందించనున్నారు. సోమవారం ఉదయం తిరువనంతపురం జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణన్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు.
"నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సబ్ డివిజన్, జిల్లాలో ఎలా పనిచేయాలో అవగాహన వచ్చాక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాను.
మనం ఎప్పుడూ ఓడిపోం. మన ప్రయత్నాలను ఎప్పుడూ విరమించకూడదు. మన ప్రయత్నాల ద్వారా అనుకున్నది సాధించగలం. నాకు ప్రజల మద్దతు, సహకారం ఎంతో అవసరం. నాతో పనిచేసే ఉద్యోగుల సహకారమూ కావాలి."
-ప్రాంజల్ పాటిల్, ఐఏఎస్
మహారాష్ట్ర వాసి అయిన ప్రాంజల్ ఆరేళ్ల వయస్సులో కంటిచూపు కోల్పోయారు. ఐఏఎస్ కావాలన్నది ఆమె కల. తన మొదటి ప్రయత్నంలో పోస్టల్ టెలికమ్యూనికేషన్ విభాగంలో అధికారిణిగా ఉద్యోగం సంపాదించారు. రెండోసారి 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించారు.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?