తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపదనే కాదు పర్యావరణాన్ని, సహజ వనరులను రక్షించుకోవడం ప్రస్తుతం ఒక సవాలుగా మారింది. ఈ ప్రయత్నంలో పర్యావరణ పరిరక్షకులు, ఉద్యమకారులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. గడచిన 15 ఏళ్లలో 1,700 మంది పర్యావరణ రక్షకులు మృత్యువాత పడ్డారని ‘గ్లోబల్ విట్నెస్’ అనే స్వచ్చంద సంస్థ నివేదించింది. 2018లోనే 164 హత్యలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా 30 హత్యలు ఫిలిప్పీన్స్‌లో నమోదయ్యాయి. కొలంబియా 24, భారత్ 23 హత్యలతో తరవాతి స్థానాల్లో నిలిచాయి.
తమిళనాడులో స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 13 మంది చనిపోవడం 2018లోనే అతిపెద్ద పర్యావరణ వ్యతిరేక నరమేధంగా ‘గ్లోబల్ విట్నెస్’ అభివర్ణించింది.
ప్రాణాలు కోల్పోయినవారిలో సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సిబ్బంది ఉంటున్నారు. మైనింగ్ తవ్వకాలు, నీటి ప్రాజెక్టులు, వ్యవసాయ, వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో హత్యల పరంపర కొనసాగుతున్నట్లు అధ్యయనం స్పష్టీకరించింది.
తవ్వకాలకు వ్యతిరేకంగా...
మెక్సికోకు చెందిన జులియన్ కరిల్లో అనే సామాజిక ఉద్యమకారుడు మాదకద్రవ్యాల సాగు, గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు రెండేళ్ల వ్యవధిలో అయిదుగురు కుటుంబ సభ్యులతో పాటు ఇంటిని కూడా కోల్పోయారు. చివరకు నిరుడు అక్టోబరులో సాయుధ దుండగుల చేతిలో కరిల్లో దారుణ హత్యకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలను కలవరపరచింది. ఈ తరహా పోరాటాల్లో నమోదుకాని హత్యలు మరెన్నో ఉంటాయన్నది నిర్వివాదం. అత్యంత హింసాత్మక ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని అంతర్జాతీయ నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి.
వనరుల రక్షణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని సాధికారతవైపు నడిపించే పర్యావరణ రక్షకులను హింసిస్తూ చంపుతున్నారు. ప్రతి పోరాటం వెనక పదుల సంఖ్యలో కార్యకర్తలు వేధింపులకు గురవుతుంటారు. చట్టవిరుద్ధ అరెస్టులు, పరువు నష్టం వ్యాజ్యాల వంటివి అందులో ఉంటాయి.
పర్యావరణ పరిరక్షకులపై దాడుల ఘటనలు అధికంగా లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లోనూ ఈ విపరీత పోకడ పెచ్చరిల్లుతోంది. ఫలితంగా పర్యావరణ వ్యతిరేక దేశమన్న అపవాదు పడుతోంది. 2015లో ఆరు, 2016లో 16, 2017లో మూడు హత్యలు మనదేశంలో చోటుచేసుకోగా, నిరుడు ఏకంగా 23 హత్యలు నమోదుకావడం విషాదం. కర్ణాటక, తమిళనాడు మొదలు మేఘాలయా వరకు దాడుల పరంపర కొనసాగుతోంది. కర్ణాటకలోని ధాండేలి ప్రాంతంలో ‘కాళీనది’పై నిర్మిస్తున్న వరస డ్యాములకు వ్యతిరేకంగా పోరాడుతున్న అజిత్ మానికేశ్వర్ నాయక్ అనే సామాజిక ఉద్యమకారుడు సాయుధ దుండగుల చేతిలో అత్యంత కిరాతకంగా హతుడయ్యారు.
తమిళనాడులో ఇలా...
నిరుడు తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై పరిశీలనకు వెళ్ళిన కానిస్టేబుల్ జగదీశన్ హత్య అక్కడి మాఫియా బరితెగింపునకు తిరుగులేని దాఖలా. ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డోంగ్రియా కోంధుల ఆక్రోశం, మేఘాలయలో అక్రమ మైనింగ్‌పై పోరాడిన అగ్నెస్ కార్షింగ్‌పై దాడి, తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా అరాచకాలు మచ్చుకు కొన్ని మాత్రమే.
సహజ వనరులకు ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున గిరాకీ ఏర్పడటంతో ఈ రంగంలో తీవ్రపోటీ నెలకొంది. మరోవైపు పర్యావరణ చట్టాలు బలహీనంగా ఉన్నాయి. దీనివల్ల అవినీతి పెచ్చరిల్లుతోంది. సహజవనరులు అడ్డగోలుగా దోపిడీకి గురవుతున్నాయి. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంటోంది. కలప, ఇసుక, ఇంధనం, ఖనిజవనరుల కోసం కావాల్సిన భూభాగాన్ని స్థానికులనుంచి బలవంతంగా లాక్కునే ధోరణి ప్రపంచంవ్యాప్తంగా కొనసాగుతోంది. వనరులున్న భూభాగాన్ని ప్రజావసరాల పేరిట చేజిక్కించుకునే పెడధోరణి ప్రబలుతోంది.
పెరుగుతున్న భూదందాలు...
కార్పొరేట్ సంస్థలు, గుత్తేదారులు, రాజకీయ నాయకులు, మాఫియాల కన్నుపడి… సాగుతున్న భూదందాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ఉద్యమకారుల్ని అణచివేయడానికి భౌతిక దాడులకూ తెగబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చట్టాలను అడ్డుపెట్టుకుని ఉద్యమకారులను ఖరీదైన కోర్టు వ్యవహారాల్లోకి లాగుతున్న వైనాన్నీ ‘గ్లోబల్ విట్నెస్’ విశదీకరించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులకు బెదిరింపులు, వేధింపులు తప్పడం లేదని పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
మనదేశంలో ఇలాంటి కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించినా, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ‘మ్యాన్ వర్సెస్ వైల్’్డ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మెరుగైన పర్యావరణాన్ని, ప్రకృతి ప్రసాదించిన వనరులను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’ అన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహతో మెలగాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఆయా స్వచ్ఛంద సంస్థలను బలోపేతం చేయాలి!
- అనిల్ కుమార్ లోడి
ఇదీ చూడండి:ఫ్రాన్స్ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ