రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించాలనుకున్న ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకొనేందుకు కుట్ర పన్నినట్లు ఓ యువకుడు ఒప్పుకోవడంపై హరియాణా పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. భయంతోనే యువకుడు తప్పుడు కథను అల్లినట్లు వివరించారు.
యువకుడిని సోనిపట్‌కు 21 ఏళ్ల యోగేశ్ రావత్గా గుర్తించామని జిల్లా ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రంధవా తెలిపారు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నించినట్లు చెప్పారు. యువకుడిని అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
"యువకుడు చేసిన వ్యాఖ్యలు నిజం కాదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడని యువకుడిని నిరసన ప్రాంతం వద్ద కొందరు వలంటీర్లు పట్టుకున్నారు. అనంతరం క్యాంప్‌కు తీసుకెళ్లారు. వీరికి భయపడే ఈ తప్పుడు కథను అల్లాడు."
-జషన్‌దీప్ రంధవా, ఎస్పీ
జనవరి 20న తన బంధువును కలిసేందుకు యోగేశ్ దిల్లీకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. జీటీ రోడ్‌లోని ప్రేమ్ కాలనీ వద్ద ఈవ్-టీజింగ్ విషయంలో యువకుడికి-నిరసనకారులకు మధ్య వాగ్వాదం మొదలైందని వెల్లడించారు. తనపై దాడి కూడా చేశారని యువకుడు చెప్పినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో యువకుడి ఒంటిపై గాయాలను గుర్తించామని వివరించారు. రైతు నాయకులు ఒత్తిడి చేయడం వల్లే యువకుడు ఈ వ్యాఖ్యలు చేశాడా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'కొంత భాగం చెప్పించారు, మిగిలింది సొంతంగా చెప్పాడు' అని పోలీసులు పేర్కొన్నారు.
యువకుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను సైతం ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు రంధవా. అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని స్పష్టం చేశారు.
ఆరోపణలు ఇవే
దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న తమను చెదరగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఓ యువకుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కుట్రలో యువకుడు భాగమయ్యాడని తెలిపారు. ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని భగ్నం చేసేందుకు తమలో నలుగురిపై కాల్పులు జరపాలనే కుట్ర జరిగిందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.