దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్రమైన చలిలోనూ ఎలాంటి అలుపు లేకుండా చేస్తోన్న నిరసనలు 34వ రోజుకి చేరాయి. రాజధాని సరిహద్దులోని సింఘు, టిక్రీ, గాజీపూర్, చిల్లా సహా పలు చోట్ల అన్నదాతలు బైఠాయించి తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య ఆరో దఫా చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహ్వానించింది. కొత్త సాగు చట్టాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని తెలిపింది.
అయితే, తాము ప్రతిపాదించిన అజెండాపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని రైతు సంఘాలు తెలిపాయి. అయినప్పటికీ చర్చలకు హాజరవుతామని స్పష్టం చేశాయి. సమావేశంలో సాగు చట్టాల రద్దుపైనే చర్చిస్తామని తేల్చిచెప్పాయి.
ఈ నేపథ్యంలో బుధవారం సింఘు సరిహద్దు నుంచి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. రైతులకు మద్దతుగా ఉంటామని కొత్త సంవత్సర వేడుకల్లో ప్రమాణం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాయి.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టాకు పర్యావరణ అనుమతులు