కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులను దోచుకొని తన మిత్రులకు పెట్టిందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేట్లకు మేలు చేసే పాలనలో రైతుల ఆదాయం సగానికి పడిపోగా... ఆ సమయంలోనే ప్రభుత్వ పెద్దల స్నేహితుల ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో వారం రోజులుగా రైతులు ముమ్మరంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రభుత్వం అబద్ధాల కోరని.. రైతులను ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వమే వారిని దోచుకుందని తీవ్రంగా ఆరోపించారు రాహుల్.
మరోవైపు.. రైతుల నిరసనల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుబట్టింది కాంగ్రెస్. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఆందోళనకారుల మనోవేదనను వినాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: అమిత్ షా నివాసంలో మంత్రుల భేటీ-ఆందోళనపై చర్చ