దేశంలో రైతులు.. తమ హక్కుల కోసం తప్పనిసరిగా పోరాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ. ప్రస్తుత పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. రాజ్యసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గణతంత్ర దినోత్సవం రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా.. గాయపడిన పోలీసు సిబ్బంది, అధికారుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 194 మంది రైతులకు నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎర్రకోట ఘటన అందరినీ షాక్కు గురిచేసిందని, దానిపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు.
పౌర చట్టాలు లేదా సాగు చట్టాలు ఏవైనా.. వీటి రాజ్యాంగ బద్ధతను తక్షణమే నిర్దరించాలని అన్నారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు.
' దిల్లీ రోడ్లపై కాదు సరిహద్దుల్లో పెట్టండి మేకులు.. '
రాజ్యసభలో మాట్లాడిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం అహాన్ని వీడి 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాక్, చైనా సరిహద్దుల్లో కాకుండా.. దిల్లీ రోడ్లపై మేకులు బిగించడమేంటని మండిపడ్డారు.
''రైతులు దిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డుపై మేకులు ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ చైనా, పాకిస్థాన్ సరిహద్దులో చేయాల్సింది. అది దేశానికి మంచిది కూడా. గత రెండు నెలలుగా రోడ్డెక్కిన అన్నదాతలను ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోంది. వారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది. మహిళలు ఉన్నారని ఆలోచించకుండా.. టాయిలెట్లను తొలగించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి రైతుల సమస్యలను వినాలి. సాగు చట్టాలను రద్దు చేయాలి.''
- సతీశ్ మిత్రా, బీఎస్పీ ఎంపీ
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. 'రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదు. జాతీయ జెండాను అవమానించిన దీప్ సిద్ధూ ఎక్కడ? ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోంది? రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదు.' అన్నారు.
ఇదీ చూడండి: 'గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?'