దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది అందించడం వీలుకాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ).. రైతుల బలవన్మరణానికి పాల్పడిన వివరాలను ఇప్పటివరకు తమ దృష్టకి తీసుకురాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం.. ఆయా రాష్ట్రాలు, యూటీలు.. రైతులు, కూలీల ఆత్మహత్యల సమాచారం 'నిల్(ఏమీ లేనట్లు)'గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేవలం రైతులు కాకుండా.. ఎలాంటి మృతుల వివరాలు అందులో పొందుపరచలేదన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో.. దేశవ్యాప్త రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఇచ్చేందుకు సాధ్యపడదని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కిషన్ రెడ్డి.
'ఎన్సీఆర్బీ' లెక్కలివే..
ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు, ఆత్మహత్యలపై.. ఎన్సీఆర్బీ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2018లో 10,357 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. 2019లో ఆ సంఖ్య 10,281కి తగ్గింది. వీరిలో 5,957 మంది రైతులు, 4,324 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయరంగంలో ఆత్మహత్య రేటును దేశంతో పోల్చగా 7.4 శాతం ఉంది.
ఇదీ చదవండి: ఉప్పు వాడకం పెరిగితే ఇన్ని అనర్థాలా?