విద్యుత్ శాఖ నిర్లక్ష్యం రాజస్థాన్ ఉదయపుర్కు చెందిన ఓ రైతును షాక్‌కు గురిచేసింది. రూ. 3.71 కోట్లు కరెంటు బిల్లు కట్టమంది.
ఉదయపుర్, గింగ్లా గ్రామానికి చెందిన, పెమారామ్ మనారామ్ డంగీ.. వ్యవసాయంతో పాటు ఊర్లో చిన్న దుకాణం కూడా నడుపుతున్నాడు. ఆ దుకాణానికి వేలల్లో కరెంటు బిల్లు రావడమే ఎక్కువ. అలాంటిది కోట్లల్లో వచ్చిన బిల్లును చూసి విస్తుపోయాడు పెమారామ్. అయితే, లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించగా.. పొరపాటు సవరించి అసలు బిల్లు రూ. 6,400 చెల్లించమన్నారు.
"నా దుకాణం కరెంటు బిల్లు రూ. 3,71,61,507 వచ్చింది. లాక్డౌన్ వేళ అసలు దుకాణమే తెరవని నాకు అంత బిల్లు రావడమేంటి?"
-పెమారామ్ మనారామ్ డంగీ, రైతు
అయితే, సర్వర్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందన్నారు రాజస్థాన్ విద్యుత్ చీఫ్ ఇంజినీర్ ఎన్ఎల్ సాల్వీ. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు బయటికొచ్చి చెప్పుకుంటే తప్పకుండా సవరిస్తామన్నారు.
ఈ ఘటనతో అధికార కాంగ్రెస్‌పై రాజస్థాన్ భాజపా భగ్గుమంది. రాష్ట్రంలో సామాన్యులకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తోందని.. ఉదయ్‌పుర్ భాజపా నేత గులాబ్ చంద్ కటారియా విరుచుకుపడ్డారు.
"గింగ్లా గ్రామంలో ఓ రైతుకు రూ. 3,71,61,507 కరెంటు బిల్లు వచ్చింది. వేలాదిమంది పేదలకు విద్యుత్ శాఖ లక్షల్లో బిల్లులు వాయిస్తోంది. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్న విద్యుత్ శాఖ వైఖరి ఇకనైనా మార్చుకోవాలి."
- గులాబ్ చంద్ కటారియా, భాజపా నేత
ఇదీ చదవండి: 'రఫేల్' వాయుసేనలోకి చేరే కీలక ఘట్టం నేడే