ఒడిశాలోని పూరీ ప్రాంతానికి దక్షిణ దిశలో ఫొని తుపాను శుక్రవారం తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అతి తీవ్ర తుపానుగా బంగాల్ వైపు దూసుకెళ్తోందని అధికారులు స్పష్టం చేశారు. తూర్పు తీరంలోని ఒడిశా, పశ్చిమబంగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఫొని తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ విపత్తు వల్ల ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.
ఫొని పయనమిలా...
నేటి తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దిశగా ఫొని తుపాను కదిలింది. ఉదయం 10.30 నుంచి 11.30 సమయంలో పూరీ ప్రాంతంలో భూభాగాన్ని తాకింది. ఒడిశాలో బీభత్సం సృష్టిస్తోంది. బాలేశ్వర్ తీరం వద్ద తిరిగి సముద్రంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బంగాల్ దిశగా పయనించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒడిశా అతలాకుతలం...
ఫొని తుపాను ఒడిశాను అతలాకుతలం చేసింది. 14 జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 170 నుంచి 240 కిలోమీటర్ల మధ్య బలమైన గాలులు వీస్తున్నాయి. వేలాది వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 11 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 4 వేల పునారావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బంగాల్ ముందస్తు చర్యలు
ఫొని తుపానుపై బంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, హావ్‌డా, హుగ్లీ, ఝార్గ్రామ్, సుందర్బన్ జిల్లాల్లో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి.
సేవలకు సిద్ధం
ఒడిశా, బంగాల్ ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఒడిశా తీరంలో నావికా, వైమానిక దళాలు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి 4 నావికా దళ ఓడలను అందుబాటులో ఉంచారు. బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సహాయక చర్యల్లో 4 వేల మందితో నిరంతరం పనిచేస్తున్నారు.
విమానాలు, రైళ్ల సేవల రద్దు
శనివారం ఉదయం వరకు విమాన సేవల్ని రద్దు చేసింది కోల్‌కతా విమానాశ్రయం. భువనేశ్వర్ విమానాశ్రయంలోనూ సేవలు నిలిచిపోయాయి. అవసరమైన సేవలందించేందుకు తామెప్పుడూ సిద్ధమేనని పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశారు. ఫొని బాధిత ప్రయాణికులకు సహాయం చేసేందుకు హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఒడిశాకు నిరంతరాయ ఇంధన సప్లై
ఒడిశాకు అవసరమైన ఇంధనాన్ని నిరంతరాయంగా అందించేందుకు చర్యలు చేపట్టామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
నేతల పర్యటనలు రద్దు
ఫొని తుపాను నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.