కేరళలోని ఇడుక్కి, కన్నూర్, కాసరగాడ్ జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంలో సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ.
ఇప్పటికే కొద్దిరోజులుగా కేరళలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొజికోడ్ జిల్లాలోని వడకరలో 10 సెంటీమీటర్లు, కాసరగాడ్లోని హోస్‌దుర్గ్‌లో 9 సెంటీమీటర్లు, కన్నూర్‌లోని తాలిపరంబులో 7 సెంటీమిటర్ల వర్షపాతం నమోదైంది.
ఆరెంజ్ అలర్ట్..
శనివారం 8 జిల్లాలు, ఆదివారం ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు.. నౌకాదళం, వాయుసేన, పోలీస్, అగ్నిమాపక విభాగాలు అప్రమత్తమయ్యాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న కారణంగా కొండప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలను నిషేధించారు అధికారులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకరు మృతి..
అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సియాంగ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లేపారాద జిల్లా నీటమునిగింది. వరదల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తి ఆచూకీ గల్లంతైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అసోంలోని పలు జిల్లాల్లో నిండుకుండలా ప్రవహిస్తోంది బ్రహ్మపుత్ర నది.
ఇదీ చూడండి: చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్ అరెస్ట్