ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్‌కు బాబ్రీ కేసులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
గవర్నర్‌గా పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అందుకు అనుగుణంగా శుక్రవారం న్యాయస్థానం ముందుకు వచ్చారు కల్యాణ్ సింగ్.
ఇరు వర్గాల వాదనల అనంతరం కల్యాణ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన తరఫు న్యాయవాది మనీశ్ తెలిపారు.
అందరూ బెయిల్ పైనే..
1992లో బాబ్రీ ఘటన సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కల్యాణ్ సింగ్. 1993లో ఆయనపై అభియోగపత్రం నమోదైంది. అయితే... తదనంతర కాలంలో రాజస్థాన్ గవర్నర్ అయ్యారు కల్యాణ్ సింగ్. రాజ్యాంగపరంగా ఉన్న రక్షణల కారణంగా బాబ్రీ మసీదు కేసులో నిందితుడిగా ఆయన్ను విచారించడం సాధ్యపడలేదు.
సెప్టెంబర్ 3న రాజస్థాన్ గవర్నర్‌గా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కల్యాణ్‌ను విచారించేందుకు ప్రత్యేక కోర్టును అనుమతి కోరింది సీబీఐ. ఈ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం... సింగ్‌కు సమన్లు జారీచేసింది.
ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీతో పాటు పలువురు నేతలు నిందితులుగా ఉన్నారు. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
ఇదీ చూడండి: ఏనుగును ఢీకొట్టి నిలిచిపోయిన రైలు