సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో 117 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఆయా స్థానాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18కోట్ల 85లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
మూడో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసీ. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే, ములాయం సింగ్ యాదవ్, జయప్రద, ఆజంఖాన్ వంటి ప్రముఖులు మూడో దశలోనే తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
గుజరాత్‌లో 26...
గుజరాత్‌లో ఉన్న మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరగనుంది. గాంధీ నగర్ నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పోటీ చేస్తున్నారు.
కేరళలో 20...
కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 227 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల 61 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు.
కేరళలో అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్‌నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు.
కర్ణాటకలో 14...
కర్ణాటకలో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 237 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే గుల్బర్గ నుంచి, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
మహారాష్ట్రలో 14...
మహారాష్ట్రలోని 14 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 249 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి పోటీ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో 10...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 10 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 120 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌యాదవ్ మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్పీ సీనియర్‌నేత అజంఖాన్, సినీ నటి, భాజపా అభ్యర్థి జయప్రద రాంపుర్‌లో తలపడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 10 లోక్‌సభ స్థానాల్లో ఏడింటిని భాజపా సొంతం చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని 7 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 123 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ...
ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
బిహార్, బంగాల్‌లో ఐదు స్థానాల్లో, అసోంలో 4 లోక్‌సభ స్థానాలతో పాటు గోవాలో 2 లోక్‌సభ స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
జమ్ముకశ్మీర్, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ దీవ్, త్రిపురలో ఒక్కో లోక్‌సభ స్థానంలో పోలింగ్ నిర్వహించనున్నారు.
దక్షిణ భారతంలో పోలింగ్ పూర్తి...
కేరళలోని 20 స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తికానుంది. కర్ణాటకలో మిగిలి ఉన్న 14 స్థానాలకు ఎన్నిక జరగనుంది. తమిళనాడులో ఎన్నిక రద్దయిన వెల్లూరు స్థానం మినహాయిస్తే... దక్షిణ భారతం మొత్తానికి ఈ విడతతో పోలింగ్ పూర్తి కానుంది.
ఇదీ చూడండి: 'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి'