భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్. కోల్‌కతాలో.. జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్) యార్డ్ నుంచి 17-ఏ ప్రాజెక్ట్‌లోని తొలి యుద్ధనౌక ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"లద్దాఖ్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అదే సమయంలో టిబెట్‌లో కొన్ని కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి దేశం తమ వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా భద్రతను కట్టుదిట్టం చేసుకుంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము. కరోనా సంక్షోభంలోనూ.. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. కానీ భారత సైన్యంపై నాకు నమ్మకం ఉంది. భూమి, గాలి, సముద్రంలో శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత త్రివిధ దళాలు ఏ విషయంలోనూ రాజీ పడవు."
--- బిపిన్ రావత్, సీడీఎస్.
ఈ హిమ్గిరి ఫ్రిగేడ్(యుద్ధనౌక)ను రావత్ సతీమణి మధులిక రావత్ ఆవిష్కరించారు. భారత నౌకాదళ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు బిపిన్ రావత్.
మొత్తం 3 ఫ్రిగేట్లను రూపొందిస్తోంది జీఆర్ఎస్ఈ. నావికాదళంలోకి చేరే ముందు.. ఈ యుద్ధనౌకలను అనేక పరిస్థితుల్లో పరీక్షించనున్నారు.
ఇదీ చూడండి:- రైల్వేస్టేషన్లో యువతిపై సామూహిక అత్యాచారం