ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ పూర్ణానంద ఘాట్‌లో కమలేశ్ భట్ అంత్యక్రియలు ముగిశాయి. దేశం లాక్డౌన్లో ఉన్నందున కేవలం 8మంది కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతినిచ్చారు అధికారులు. కమలేశ్ తండ్రి, సోదరుడు విమలేశ్ భట్ సహా మరో ఆరుగురు అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఈటీవీ భారత్ సాయంతో...
ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈనెల 17న గుండెపోటుతో మరణించిన ఉత్తరాఖండ్ తెహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం 'ఈటీవీ భారత్' చొరవతో పది రోజుల తర్వాత ఇల్లు చేరింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు.
కమలేశ్ మృతదేహం అబుధాబి నుంచి భారత్‌కు రావటం ఇది రెండోసారి. ఈనెల 23న మొదటిసారి అబుధాబి ఎతిహాడ్ విమానాశ్రయం నుంచి దిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది భట్ మృతదేహం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన లాక్డౌన్ నిబంధనల వల్ల ఎలాంటి ప్యాకేజీని స్వీకరించేందుకు అనుమతులు లేవని కార్గో సిబ్బంది స్పష్టం చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించకుండా గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి అబుధాబి పంపించారు.
మృతదేహాన్ని తిప్పి పంపించటంపై ఈటీవీ భారత్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు అతడి కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించింది ఈటీవీ భారత్.
కమలేశ్ భట్ మృతదేహాన్ని తిరిగి పంపటంపై న్యాయవాదులు రితుపర్ణ యునియాల్, అభిషేక్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. అమానవీయంగా, నిర్లక్ష్యంగా సంబంధిత అధికారులు వ్యవహరించారని, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని.. వచ్చిన విమానంలోనే తిరిగి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు.
ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అయితే మృత దేహాల తరలింపునకు ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫెట్ను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య