మహిళల కనీస వివాహ వయస్సును పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న విషయమై అధ్యయనం చేయడానికి కార్యదళా(టాస్క్‌ఫోర్స్)న్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ శనివారం జారీ చేసిన పత్రికా ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది. మహిళల వివాహ వయస్సు ప్రస్తుతం 18 సంవత్సరాలు కాగా, దీన్ని ఎంతకు పెంచాలనేదానిపై అధ్యయనం చేయనున్నారు. దిల్లీకి చెందిన జయా జైట్లీ అధ్యక్షురాలిగా, నజ్మా అఖ్తర్ (దిల్లీ), మహారాష్ట్రకు చెందిన వసుధా కామత్, గుజరాత్‌కు చెందిన దీప్తి షా సభ్యులుగా ఈ కార్యదళం ఏర్పాటయింది. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తోపాటు, కేంద్ర వైద్య-ఆరోగ్యం, మహిళాశిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖల కార్యదర్శులు పదవి రీత్యా సభ్యులుగా కొనసాగుతారు.
ఈ కార్యదళం జులై 31కల్లా నివేదిక ఇవ్వనుంది. గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేశారు.
బడ్జెట్‌లో ఏం చెప్పారు?
"శారదా చట్టం-1929లోని నిబంధనలను సవరించి 1978లో మహిళల వివాహ వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఎంతో పురోగమించింది. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు ఎదగడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. మాతృ మరణాలను తగ్గించడంతోపాటు పౌష్టికాహార స్థాయిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళ ఏ వయస్సులో మాతృత్వంలోకి అడుగుపెట్టాలన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం అంశాలను పరిశీలించాల్సి ఉంది. అందుకోసం ఆరునెలల్లో సిఫార్సులు చేసేలా ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తాం" అని పేర్కొన్నారు.
అధ్యయనం చేసే అంశాలు
- వివాహ వయస్సు, మాతృత్వానికి మధ్య ఉన్న సహ సంబంధాన్ని పరిశీలిస్తుంది. ఈ రెండు అంశాలతో ముడిపడిన ఆరోగ్యం, వైద్యపరమైన సమస్యలు, గర్భధారణ సమయంలో తల్లీపిల్లల పౌష్టికాహార స్థాయి, కాన్పుల సమయంలో తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేస్తుంది. శిశుమరణాలు, మాతృమరణాలు, సంతాన సాఫల్య రేటు, స్త్రీ-పురుష నిష్పత్తి అంశాలను పరిశీలిస్తుంది.
- మహిళల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి సూచనలు చేస్తుంది.
- ఇందుకోసం కొత్త చట్టం తేవాలా? లేదంటే ఉన్న చట్టాలకు సవరణలు చేస్తే సరిపోతుందా? అని చెబుతుంది.
- ఈ సిఫార్సుల అమలుకు నిర్దిష్ట గడువును సూచించడంతో పాటు, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది.
ఇదీ చూడండి: పులుల సంఖ్యలో ఏటా 6 శాతం వృద్ధి