కరోనాను సమూలంగా నివారించేందుకు లాక్డౌన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఏప్రిల్ 20న ప్రకటించిన కొన్ని మినహాయింపులను కూడా చాలా కఠినంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ఒక్క రోజు తరువాత కేంద్ర హోంశాఖ లాక్డౌన్ మార్గదర్శకాలను జారీ చేసింది.
లేఖలు
కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా... అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల కార్యనిర్వహణాధికారులకు లేఖలు రాశారు. సవరించిన ఏకీకృత లాక్డౌన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా విజృంభించే ప్రమాదముందని హెచ్చరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రజలందరూ కచ్చితంగా లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని భల్లా స్పష్టం చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏప్రిల్ 20న ప్రకటించిన కొన్ని మినహాయింపులు... సరిగ్గా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాలని సూచించారు. లాక్డౌన్ మార్గదర్శకాలకు ఎలాంటి భంగం కలుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
అక్కడ వర్తించవు..
లాక్డౌన్ మార్గదర్శకాల్లో (పేరా 5 నుంచి 20 వరకు) పేర్కొన్న కార్యకలాపాలు.. రాష్ట్రాలచేత గుర్తించని హాట్స్పాట్ల్లోని కంటైన్మెంట్ జోన్లలో వర్తించవని భల్లా స్పష్టం చేశారు. రాష్ట్రాలు, యూటీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా లాక్డౌన్ మార్గదర్శకాల కంటే కఠినమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: వలస కూలీల 'మహా' నిరసనపై దర్యాప్తు- ఇద్దరు అరెస్టు